ఈ రోజుల్లో ఎన్నికల్లో గెలవాలంటే.. మాటలు కాదు.. అంతా కాసుల గలగలే.. ఏ ఎన్నిక ఖర్చు చూసినా.. కోట్లలోనే ఉంటోంది. ఎమ్మెల్యే కైతే.. నాలుగు నుంచి 10 కోట్లు.. ఎంపీకైతే.. 15 నుంచి 30 కోట్లు ఖర్చు చేయాల్సివస్తోందని రాజకీయ నేతలే గగ్గోలు పెడుతున్నారు. జనం కూడా బాగా తెలివిమీరిపోయారు. ఓటుకు వాళ్లు ఇంత ఇస్తుంటే.. మీరేంటి మరీ ఇంత తక్కువిస్తున్నారని నిలదీసే రోజులు వచ్చాయి. ఓవైపు ఓట్ల కొనుగోలు.. మరోవైపు ప్రచారం ఖర్చు.. పోలింగ్ ముందు మందుబాబులకు మందు పోయించడం.. వీటికి తోడు పార్టీలో టిక్కెట్ తెచ్చుకునేందుకు అధినేతలకు అనధికారికంగా సమర్పించుకోవడం.. మొత్తం మీద ఎమ్మెల్యేగానైనా ఎంపీగానైనా ఎన్నికవ్వడమంటే కోట్ల రూపాయల వ్యవహారం అయ్యింది. ఇన్ని కష్టాలు లేకుండా అధ్యక్షా.. అని అరవాలంటే ఒక్కటే మార్గం.. అదే ఎమ్మెల్సీ.. పార్లమెంటుకైతే.. రాజ్యసభ.. అందుకే రోశయ్య వంటి ఉద్దండపిండాలు కూడా ఎన్నికల ఖర్చు తట్టుకోలేక ఎమ్మెల్సీ అయ్యేందుకు మొగ్గు చూపారు. మరి అలాంటి అవకాశం కల్పించే మండలి వ్యవస్థ త్వరలో కనుమరుగు కాబోతోందా.. అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం వీటి కొనసాగించాలా వద్దా అనే అంశంపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా మండళ్ల వ్యవస్థ ఒకే తీరుగా లేదు. అసెంబ్లీ అన్ని రాష్ట్రాలకు ఉన్నా.. శాసన మండళ్లు.. ఆయా రాష్ట్రాల ఇష్టా ఇష్టాల మేరకే ఉన్నాయి. మన ఏపీలో గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఈ మండలితో ఒకగూరేదేమీలేదని.. రద్దు చేసేసింది. మళ్లీ రాజశేఖర్ రెడ్డి వచ్చాక మండలిని పునరుద్దరించారు. ఇప్పుడు మోడీ సర్కారు.. మండళ్లు అవసరమైతే అన్ని రాష్ట్రాల్లో ఉండాలి.. వద్దనుకుంటే.. ఎక్కడా వద్దు.. ఒకే దేశంలో రాష్ట్రానికో విధానం ఉండరాదని పట్టుబడుతోంది. దీనిపై రాష్ట్రాలను అభిప్రాయం చెప్పమని కోరింది. రాష్ట్రాలు చెప్పే సమాధానాలను బట్టి ఓ నిర్ణయానికి రానుంది. మండళ్ల వ్యవస్థపై భిన్న రకాల అభిప్రాయాలు ఉన్నాయి. మండలి వ్యవస్థ ప్రభుత్వానికి ఆరోవేలు వంటిదని.. అనవసర ఖర్చు అనే వాదన ప్రధానమైంది. అందులో వాస్తవం లేకపోలేదు. ఐతే.. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేని మేథావులు, సమాజంలోని భిన్నవర్గాల ప్రతినిధులు మండలి ద్వారా ప్రజాప్రతినిధులవుతారు. ప్రజాసమస్యలపై చర్చిస్తారు. ఇదో సానుకూలాంశం.. మరి మోడీ సర్కారు చివరకు ఏ నిర్ణయం తీసుకుంటుందో.. ?

మరింత సమాచారం తెలుసుకోండి: