గులాబీ రంగు పేరెత్తగానే టక్కున గుర్తొచ్చే రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. పార్టీ రంగు గులాబీ అయినప్పటికీ ఆ రంగు తెలంగాణ పేరెత్తగానే గుర్తొచ్చే స్థాయికి చేరుకుంది. పద్నాలుగేళ్లు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన టీఆర్ఎస్... సాధించుకున్న తెలంగాణలో అధికార పీఠంపైనా ఆశీసురాలైంది. ప్రభుత్వాధినేతగా పాలనలో దూకుడుగా సాగుతున్నారు పార్టీ అధినేత కేసీఆర్. అధికార పక్షంగా పార్టీ కార్యకలాపాలకు నేతలు కొంచెం దూరం కావాల్సి వస్తోంది. దీంతో పార్టీ మీద అభిమానం, తమ పార్టీ రంగు మీద తమకున్న ప్రేమనూ చాటుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇరు రాష్ట్రాల శాసన సభ్యుల నివాసం కోసం హైదరాబాద్ లో క్వార్టర్లు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్న వీటిని ఇప్పుడు రెండు రాష్ట్రాలకూ విభజించారు. హైదర్ గూడలో ఎంఎస్1, ఎంఎస్2 బ్లాకులు ఉండగా... ఆదర్శనగర్ లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్లు ఉన్నాయి. వీటిలో ఎంఎస్1 బ్లాక్ ను ఆంధ్రప్రదేశ్ కు, ఎంఎస్ 2 బ్లాక్ ను తెలంగాణ రాష్ట్రానికీ కేటాయించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్లను మాత్రం ఇరు రాష్ట్రాలకు చెరి సగం అని నిర్ణయించారు. ఇప్పుడు వీటిల్లో తమ రాష్ట్రానికి కేటాయించిన వాటికి గులాబీ రంగు వేయాలన్న ప్రతిపాదనను టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ క్వార్టర్ల కేటాయింపు కమిటీ సమావేశం తాజాగా జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షుడిగా ఉన్న ఈ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికీ క్వార్టర్లు ఖాళీ చేయని పాత సభ్యులు వారంలో ఖాళీ చేయాలని తేల్చి చెప్పారు. వాస్తు పరంగా ఎలాంటి మార్పులూ చేపట్టరాదని... కామన్ రిపేర్లు, పెయింటింగ్ కు మాత్రమే నిధులు వెచ్చించాలని నిర్ణయించారు. అయితే ఆ రంగు మాత్రం గులాబీ కావాలని కూడా కమిటీ సభ్యులు తీర్మానించారు. కమిటీలో టీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు సైతం సభ్యులుగా ఉన్నా... ఎవ్వరూ గులాబీ రంగు ప్రతిపాదనను వ్యతిరేకించలేదు. ఇదే స్పీడుతో టీఆర్ఎస్ గవర్నమెంటు మున్ముందు ప్రభుత్వ కార్యాలయాలకు సైతం గులాబీ రంగు రుద్దుతుందేమో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: