హైదరాబాద్ నగరంలోని కూల్చివేతల పర్వంపై స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. గురుకుల్ ట్రస్టు భూముల్లోని భవనాలతో మొదలైన ఈ కూల్చివేతలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే.. నగరంలో 33 భవనాలు నేలమట్టమయ్యాయి. జీహెచ్ఎంసీ స్థాయి సంఘం తీర్మానం చేసినా... కార్పొరేటర్లు అడ్డుకుంటున్నా కూల్చివేతలు మాత్రం ఆగడం లేదు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని.. సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆరే ఆదేశించడంతో ఎవరి రిక్వెస్టులు, పైరవీలు పనిచేయడం లేదు. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై రాజీ లేదని మొన్న కేసీఆరే స్వయంగా ప్రకటించారు. అంతే కాదు.. ఇప్పుడు చూస్తున్నది కొంచెమేనని.. ఇక ముందు ఉగ్రనరసింహావతారం ఎత్తుతానని చెప్పారు. దీనిపై స్పందిస్తున్న కార్పోరేటర్లు ఉగ్రనరసింహుడు తమకు వద్దంటున్నారు. శాంతమూర్తి వంటి రాముడు కావాలంటున్నారు. కూల్చివేతలపై ఒక్కటవుతున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కార్పొరేటర్లు భవిష్యత్ వ్యూహంపై చర్చిస్తున్నారు. అవసరమైతే.. సీఎం కేసీఆర్ ను కలసి కూల్చివేతలు ఆపాలని కోరాలని నిర్ణయించారు. కూల్చివేతలను ఇకపై చూస్తూ ఊరుకోబోమని.. అరెస్టులను ఎదుర్కొనైనా సరే.. వాటిని అడ్డుకుంటామని కార్పొరేటర్లు చెబుతున్నారు. డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ నేతృత్వంలో కార్పొరేటర్లంతా శుక్రవారం సమావేశమయ్యారు. కూల్చివేతలు ఆపాలని జీహెచ్ ఎంసీ చేసిన తీర్మానాన్ని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. కూల్చివేతల్లో అధికారులు పక్షపాతం చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పంజాగుట్ట సెంటర్లోని ఓ వాణిజ్యసముదాయాన్ని కూల్చాలని సాక్షాత్తూ న్యాయస్థానమే ఆదేశించినా పట్టించుకోని వారు మధ్యతరగతి జీవులు కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూలుస్తున్నారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: