యాపిల్ ఐఫోన్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. చైనాలో ఒక యువకుడు ఈ ఫోన్ కొనడం కోసం తన కిడ్నీను విక్రయించడమే దీనికి నిదర్శనం. స్మార్ట్‌ఫోన్ అంటే యాపిల్ ఐఫోన్ అని చాలా మంది భావిస్తారు. సాధారణంగా యాపిల్ కంపెనీ ఐఫోన్లలో కొత్త వెర్షన్‌ను ప్రతి ఏటా సెప్టెంబర్‌లో విడుదల చేస్తోంది. ఈ ఆనవాయితీ ప్రకారమే ఈ ఏడాది సెప్టెంబర్‌లో (బహుశా 19 వ తారీఖు)ఐఫోన్ 6ను మార్కెట్లోకి అందించాలని యాపిల్ ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ యాపిల్ ఐఫోన్ 6 ఎలా ఉండబోతోందో అన్న చర్చలు బాగా జరుగుతున్నాయి. స్క్రీన్ సైజు ఎంత ఉండొచ్చు, ఏమేం ఫీచర్లుంటాయి, తదితర అంశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఐఫోన్ 6కు సంబంధించి వార్తలు, వదంతులు, లీకేజ్‌లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. 4.7 అంగుళాల సైజ్ స్క్రీన్ ఉండొచ్చని, 113 గ్రాముల బరువుంటుందని.. ఇలా రకరకాలుగా ఇంటర్నెట్‌లో వార్తలు వస్తున్నాయి. అప్పుడే అనుకరణలు మొదలు యాపిల్ ఐఫోన్‌లో కొత్త మోడల్ ఐఫోన్ 6 రావడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. అయినప్పటికీ, ఐఫోన్ 6కు నకళ్లు మాత్రం జోరుగా తయారవుతున్నాయని సమాచారం. ఇంటర్నెట్ ద్వారా ఐఫోన్ 6 గురించి పలు అంశాలు లీక్ అవుతున్నాయి. అనేక వదంతులు విస్తరిస్తున్నాయి. ఈ లీక్‌లు, వదంతులను ఆధారం చేసుకొని ఐఫోన్ 6 ఎలా ఉండబోతోందో కొన్ని మొబైల్ కంపెనీలు అంచనాలు వేస్తున్నాయి. ఈ అంచనాలు ఆధారంగా ఐఫోన్ 6కు నకలు ఫోన్‌ను అవి రూపొందిస్తున్నాయి. ఐఫోన్ 6 మార్కెట్లోకి వచ్చిన వారం రోజుల్లోనే దానికి నకిలీలు రావచ్చు. పెద్ద స్క్రీన్..: పెద్ద సైజు స్క్రీన్ ఉన్న ఐఫోన్‌ను మార్కెట్లోకి తేవాలని యాపిల్ కంపెనీ భావిస్తోంది. 2 నెలల్లో పెద్ద సైజ్ ఐఫోన్‌ను అందించడం సాధ్యం కాదని, అందుకే ముందుగా 4.7 అంగుళాల సైజు స్క్రీన్ ఉన్న ఐఫోన్‌ను అందించాలని, ఆ తర్వాత 5.5 అంగుళాల సైజు స్క్రీన్ ఉన్న ఐఫోన్‌ను అందుబాటులోకి తేవాలని కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఐవాచ్ కూడా..: ఈసారి ఐవాచ్‌ను అందించాలని యాపిల్ సీఈవో టిమ్ కుక్ భావిస్తున్నట్లు సమాచారం. యాపిల్ స్మార్ట్-వాచ్‌కు డిమాండ్ పెరుగుతోందని, అందుకని ఐవాచ్ అందిస్తే బావుంటుందన్న అంచనాలతో యాపిల్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందని విశ్లేషకులంటున్నారు. శామ్‌సంగ్ గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌ను ఇప్పటికే అందిస్తున్న తెలిసిందే. టాగ్లు: యాపిల్ ఐఫోన్‌, యాపిల్ ఐఫోన్ 6, శాన్‌ఫ్రాన్సిస్కో, Apple iPhone, Apple iPhone 6, San Francisco

మరింత సమాచారం తెలుసుకోండి: