ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడిచినప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో వర్షాల జాడ లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో 715 మి.మీ సాధారణ వర్షపాతం కాగా 9వ తేదీ నాటికి 238.8 మి.మీ వర్షపాతం నమోదు కావల్సి ఉండగా 124.1 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. దాదాపు సగం వర్షపాతం మాత్రమే నమోదైంది. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 19 శాతం తక్కువ వర్షపాతం ఉండగా మిగతా జిల్లాలో దాదాపు సగానికి పైగా తక్కువ వర్షపాతం నమోదైంది. నిజమాబాద్‌ జిల్లాలో దాదాపు తీవ్ర వర్షభావ పరిస్థితులు ఏర్పడినాయి. ఆంధ్రప్రదేశ్‌లో సీజన్‌ సాధారణ వర్షపాతం 554.3 మి.మీ కాగా 166.1 మి.మీ వర్షపాతం నమోదు కావల్సి ఉండగా 110.9 మి.మీ (33% తక్కువ) వర్షపాతం మాత్రమే రికార్డు అయ్యింది. శ్రీకాకుళం, కర్నూలు, అనంతపూర్‌, చిత్తూరు జిల్లాలో సాధారణ వర్షపాతం ఉండగా మిగతా 9 జిల్లాలో 59 శాతం తక్కువగా వర్షాలు కురిసి రెండు రాష్ట్రాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో విత్తనాలు విత్తక అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. దీనికి తోడు కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులలో నీరు అడుగంటి పోవడంతో మెల్లమెల్లగా ఖరీఫ్‌పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ముఖ్యంగా జూలై నెలాఖర్‌ నాటికి వర్షాలు కురిసి, జలశయాలలోకి నీరు చేరనట్లయితే తెలంగాణలో వరి, పత్తి, సోయాబీన్‌ లాంటి ప్రధాన పంటలు విత్తే సమయం దాటి పోనుంది. రైతాంగానికి అంతో ఇంతో లాభసాటిగా ఉండే పంటల కాలం ముగిసి పోవడంతో ప్రత్యామ్నాయ పంటలే దిక్కు కానున్నాయి. ఇందుకు వ్యవసాయశాఖ ప్రత్యా మ్నాయ పంటల ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పుతున్నప్పటికీ ఆ దిశలో చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కన్పించడం లేదు. పరిస్థితులు తీవ్రంగా మారుతున్నప్పటికీి పాలకులు మాత్రం ప్రకటలనలకే పరిమితమవుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయశాఖ ప్రణాళిక ప్రకారం కోటి ఎకరాలు సాధారణ సాగు విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల ఎకరాలలో పంటలు సాగు కావల్సి ఉంది. అయితే ఈ నెల 16వ తేదీ నాటికి 47 లక్షల ఎకరాలలో మాత్రమే పంటలు సాగు చేశారు. అది కూడా సీజన్‌ ప్రారంభంలో కురిసిన వర్షాలకు పంటలు విత్తుకోగా అనంతరం ఏర్పడిన వర్షాభావ పరిస్థితులకు వేసిన పంటలు మొలకదశలోనే ఎండిపోయాయని రైతులు చెప్తున్నారు. గతేడాది ఇదే సమయానికి తెలంగాణ ప్రాంతంలో దాదాపు 60 లక్షల ఎకరాలలో పంటలు సాగు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ యేడాది ఖరీఫ్‌ సీజన్‌లో కోటి 4 లక్షల 70 వేల ఎకరాలు సాధారణ సాగు విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు 29.40 లక్షల ఎకరాలలో పంటలు సాగుచేయవల్సి ఉండగా 22.29 లక్షల ఎకరాలలో మాత్రమే పంటలు సాగు చేశారు. గతేడాది 24.3 లక్షల ఎకరాలలో పంటలు సాగు జరిగింది. రెండు రాష్ట్రాలలో కలిపి దాదాపు 20 లక్షల ఎకరాలలో తక్కువ పంట సాగు జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌ ఉపందుకోవడానికి ఆగస్టు వరకు సమయం ఉంది. అప్పటి వరకు వర్షాలు కురిసి పరిస్థితి మెరుగవుతుందని అన్నదాతలు ఆశతో ఉన్నారు. తెలంగాణలో మాత్రం పరిస్థితి ఆందోళన కరంగా ఉందని పాలకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించనట్లయితే రైతుల పరిస్థితి దీనాతిధీనంగా మారనుందని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: