మలేషియన్‌ విమానాన్ని కూల్చింది ఎవరు..? రష్యానా..? ఉక్రెయినా..? లేదా రష్యా సహకారంతో రెబల్స్‌ పేల్చేశారా..? ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. 298 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఘోర దుర్ఘటనపై.. రష్యా, ఉక్రెయిన్‌లు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటుండగా.. అసలు విషయం రాబట్టేందుకు ఐక్యరాజ్యసమతి ప్రయత్నిస్తోంది. ఇంతటి ఘోరానికి పాల్పడింది ఎరన్నది తేల్చేపనిలో పడింది. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి తర్వాత అత్యంత దుర్ఘటనగా నిలిచిన మలేషియన్‌ విమాన ప్రమాదం.. పెను సంచలనమే సృష్టిస్తోంది. ముందు విమానం కూలిపోయిందని భావించినా.. ఉద్దేశపూర్వకంగానే కూల్చేశారన్న విషయం బయటపడటంతో దుమారం రేగుతోంది. ఈ పని చేసింది ఎవరన్నది చర్చనీయాంశమైంది. రెండు దేశాల మధ్య ఉన్న ఘర్షణల నేపథ్యంలో.. రష్యా, ఉక్రెయిన్‌లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా.. అసలు విషయం ఏంటన్నది మిస్టరీగా మారింది. ఎవరి అనుమానాలు వారికున్నా.. ఆధారాలతో దోషులను పట్టుకోవడానికి డేటా రికార్డింగ్‌ డివైజ్‌, బ్లాక్‌ బాక్సులే కీలకంగా మారాయి. విమానంలో ఆఖరి నిమిషంలో జరిగిన సంభాషణల ఆధారంగా విషయం రాబట్టాలని ఐక్యరాజ్యసమతి భావిస్తోంది. అయితే వీటి విషయంలోనూ చాలా నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి.  ప్రమాద స్థలంలో డేటా రికార్డింగ్‌ డివైస్‌ దొరకలేదని ఉక్రెయిన్‌ అధికారులు ప్రకటించగా.. ఎమర్జెన్సీ సర్వీస్‌ కార్మికులకు డివైస్‌ దొరికిందని డొనెస్టెక్‌ గవర్నర్‌ ప్రకటించారు. అయితే దీనిపై కచ్చితమైన సమాచారం లేదని అన్నారు. ఇదిలా ఉంటే ప్లైట్‌ బ్లాక్‌బాక్స్‌ తమకు దొరికిందని రష్యా అనుకూల రెబల్స్‌ ప్రకటించారు. బ్లాక్‌బాక్స్‌ల విషయంలోనే ఇంత గందరగోళం ఉంటే.. రష్యా, ఉక్రెయిన్‌లు చెబుతున్న విషయాలు మరింత గందగోళానికి గురిచేస్తున్నాయి. రష్యా, డొనెస్టెక్‌ ప్రాంతంలోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు.. ఉక్రెయిన్‌ సైన్యమే విమానాన్ని కూల్చేసిందని ఆరోపిస్తున్నారు. BUK M1 మిస్సైల్‌ను ఉక్రెయిన్‌ ప్రయోగించినట్లు తమకు సంకేతాలు అందాయని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌ మాత్రం రష్యా అనుకూల తిరుగుబాటుదారులే విమానాన్ని కూల్చేశారని ఆరోపిస్తోంది. రష్యా అండదండలతోనే ఇదంతా జరిగిందని అంటోంది. విమానాన్ని కూల్చిన వెంటనే రెబల్స్‌.. రష్యా సైనికాధికారులకు ఫోన్‌ చేశారని.. దీనికి సబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెబుతోంది. విమాన ప్రమాదంపై ముందు రెండు దేశాలతో సంప్రదింపులు జరిపిన అమెరికా.. ఇప్పుడు రష్యా పైనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రష్యా తయారు చేసిన యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిస్సైల్‌ SA-11ను ప్రయోగించినట్లు భావిస్తోంది. దీనికి సంబంధించి తమ వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయంటున్న అమెరికా.. రష్యా ఉద్దేశపూర్వకంగానే ఈ మిస్సైల్స్‌ను తిరుగుబాటుదారులకు ఇచ్చిందని అనుమానిస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దేశాల మధ్య ఉన్న విభేదాలతో తీవ్ర ఘర్షణలకు దారితీసేలా కనబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: