సమైక్య రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దయనీయంగానే ఉంది. ఉద్యోగులకు కూడా సరిగా జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి వాస్తవమే. అసలు ఖజానాలో ఎంత ఉందో.. ఎంత రాబడి వస్తుందో.. వంటి ప్రాథమిక వివరాలు కూడా అందుబాటులో లేవని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే రోజూ మీడియా ముందు వాపోతున్నారు. అడ్డగోలు విభజతో అన్ని విధాలా ఏపీ నష్టమే. ఇవన్నీ వాస్తవాలే.. ఎవరూ కాదనలేరు. మరి ఈ సమస్యల నుంచి బయటపడేదెలా.. ఇప్పుడు సీఎం చంద్రబాబు ముందున్న పెద్ద సమస్య ఇదే. 9ఏళ్ల రాష్ట్రాన్ని పాలించిన సమర్థుడిగా పేరున్న చంద్రబాబు రాష్ట్రాన్ని ఓ దరికి చేరుస్తారనే జనం ఆయనకు పట్టం గట్టారు. మరి తెలియక చేస్తున్నారో.. తెలిసే చేస్తున్నారో తెలియదు గానీ.. కొన్ని పనులు రాష్ట్ర పరువును బజారున పడేస్తున్నాయి. పొరుగు రాష్ట్రం వారి ముందు తలదించుకునేలా చేస్తున్నాయని జనం వాపోతున్నారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ప్రత్యక్షమైన హుండీలే ఇందుకు ఉదాహరణ. మనిషెత్తున ఉన్న రెండు హుండీలను అధికారులు సెక్రటేరియట్ లో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోగో ముద్రించి మరీ ఉంది. రాష్ట్ర రాజధాని కోసం విరాళాలు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని హుండీలపై ముద్రించారు. ఆర్థిక పరిస్థితి ఎంత బాగాలేకపోతే మాత్రం ప్రభుత్వం పేరుతో అలా హుండీలు పెట్టి మరీ అడుక్కుంటారా అన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఐతే ఈ హుండీలపై మరోవాదన వినిపిస్తోంది. దేవుడి గుళ్లోనూ హుండీలు ఉంటాయి. అంటే మరి దేవుడు అడుక్కుంటున్నట్టా.. కాదు కదా.. ప్రజాసంక్షేమం కోసం ధనం సేకరించడం తప్పుకాదని మరికొందరు వాదిస్తున్నారు. అది నిజమే అయినా.. ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు విజ్ఞప్తి చేసింది. విరాళాలు పంపమని కోరింది. ఆసక్తి ఉన్నవారు ఇప్పటికే విరాళాలు చెక్కులద్వారా ఇస్తున్నారు. మొన్నటికి మొన్న పశ్చిమగోదావరి జిల్లాలో ఆడపడుచులు 60 లక్షల రూపాయల చెక్కు బాబుకు అందజేశారు. అంతవరకూ ఓకే గానీ.. హుండీలు పెట్టి మరీ అడుక్కుంటే ఎలా అంటున్నారు మరికొందరు. హుండీల ఏర్పాటుపై కొన్ని గంటల్లోనే విమర్శలు రావడంతో ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సాయంత్రానికల్లా ఈ హుండీలను ఆటోలో అక్కడి నుంచి తరలించారు. ఇంతకీ వాటిని ఎవరు ఏర్పాటు చేశారు. మరి ఎందుకు గంటల్లోనే మాయం చేశారు. అన్ని విషయాలు మాత్రం తెలియడం లేదు. కాస్త ముందూ వెనుకా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే.. ఇలాంటి నగుబాట్లు ఉండవు కదా..

మరింత సమాచారం తెలుసుకోండి: