తెలంగాణ ప్రబుత్వం చేపట్టిన ఫాస్ట్ కార్యక్రమం రెండు రాష్ట్రాల మధ్య గొడవలను పెద్దది చేసేలా ఉంది. తెలంగాణ పిల్లలకే ఫీజులు చెల్లిస్తామంటున్న కేసీఆర్ నిర్ణయాన్ని సీమాంధ్ర మంత్రులు ఇప్పటికే ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ హిట్లర్, తుగ్లక్ లా వ్వవహరిస్తున్నారని మండిపడ్డారు. న్యాయపోరాటం కూడా చేస్తామంటున్నారు. దీనిపై తెలంగాణ హోంమంత్రి ఫుల్లుగా రెచ్చిపోయారు. అసలే బొంగురు గొంతుతో మాట్లాడే నాయని.. ఆగ్రహంతో మరింత బొంగురుగా మాట్లాడారు. ఆడలేక మద్దెల ఓడు అన్న విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీమాంధ్ర మంత్రులు లేనిపోని అభాండాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తామంటుంటే, మా పిల్లలకు మీరు ఎందుకు ఆర్థిక సహాయం చేయడంలేదని అక్కడి ప్రజలు ఆ మంత్రులను నిలదీస్తున్నారని నాయని అన్నారు. అక్కడ సమాధానం చెప్పుకోలేక వారు ఇక్కడ కేసీఆర్‌ను తిడుతున్నారని మండిపడ్డారు. . మీ పిల్లలకు పది సంవత్సరాలు చదువుకోవడానికి అవకాశం ఇచ్చాం... చదువుకోండి... మీ పిల్లలకు ఫీజులు కట్టడానికి మీకేం కష్టమని విమర్శలు గుప్పించారు. ఆంధ్ర మంత్రులు.. తమ ప్రజల బాగుగోలు చూసుకోవాలని.... తెలంగాణ ప్రజల బాగోగులు మేం చూసుకుంటమని నాయని ఘాటుగా అన్నారు. మా పాలనలో వేలుపెట్టొద్దని హెచ్చరించారు. నాయని ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఈ 1956 నిర్ణయం గతంలో చంద్రబాబు కూడా తీసుకున్నారట. 1956 ముందు స్థానిక నివాసం ఉన్నవారినే స్థానిక గిరిజనులుగా గుర్తిస్తామని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారని నాయని వెల్లడించారు. 1956 ముందు స్థిరపడిన గిరిజనులకే ఐటీడీఏలో ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో సీమాంధ్రుల దోపిడీ పెరిగిపోయిందని...తాము ఉద్యోగాలు, వనరులను కోల్పోయామని నాయని అన్నారు. అయినా ఇది కేవలం చదుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం కోసం ఉద్దేశించిందేనని.. అన్నింటికీ 1956 వర్తింపజేస్తారంటూ... మాకు లేనిపోని ఐడియాలు ఇస్తున్నారని వెటకారం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: