పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డిపై స్థానిక తెలుగుదేశం నేతలు తిరుగుబాటు చేసేలా ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలో కమ్మ, రెడ్డి గొడవ అక్కడ తీవ్రం అయ్యిందని సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి స్థాయిలో కూడా ఉన్న రఘునాథరెడ్డి పై తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్, కమ్మ సామాజికవర్గం వాళ్లు మంత్రిగారిపై మండి పడుతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం కమ్మ జనాభా కొంచెం ఎక్కువ. నియోజకవర్గ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్నారు కమ్మవాళ్లు. అందుకు తగ్గట్టుగా ఇక్కడ వరసగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశమే గెలుస్తూ వస్తోంది. అయితే గెలుస్తున్నది తెలుగుదేశమే అయినా.. ఎమ్మెల్యే మాత్రం రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. ఇన్నేళ్ల సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో కొత్త గొడవలు మొదలయ్యాయి. పల్లె రఘునాథరెడ్డి తన సామాజికవర్గాన్ని ఆదరిస్తున్నాడని స్థానిక కమ్మవాళ్లు గోల పెడుతున్నారు. రెడ్లు తెలుగుదేశం పార్టీకి ఓటే వేయలేదని.. వారికి ఇప్పుడు అన్నీ ఇవ్వడం ఏమిటని.. ఓట్లు మావి, ప్రాధాన్యత వాళ్లకా అంటూ మంత్రిగారిపై మండి పడుతున్నారు. ఈ మేరకు నియోజకవర్గ స్థాయిల్లో మీటింగులు పెట్టుకొని మంత్రిగారి తీరును వ్యతిరేకిస్తున్న కమ్మ నేతలు, ఇతర అసంతృప్త కార్యకర్తలు.. ఇప్పటికే చంద్రబాబు కు కూడా ఫిర్యాదు కూడా చేశారట. ఎంపీటీసీ చైర్మన్ లు, కొన్ని నామినేటెడ్ పదవులను రెడ్లకు దక్కేలా చేయడంతో పాటు.. కాంగ్రెస్ సమయంలో రేషన్ డీలర్ షిప్ ను దక్కించుకొన్న వాళ్లను తొలగించకపోవడంపై కూడా కమ్మ సామాజికవర్గం ఫైర్ అవుతోంది. తక్షణం వారిని తొలగించి తమకు డీలర్ షిప్ లను ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయినా మంత్రిగారు స్పందించకపోవడంపై కూడా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారట. మరి ఈ వ్యవహారంపై బాబుగారు ఎలా స్పందిస్తారో.. కమ్మ, రెడ్డి గొడవను ఎలా సద్దుమణిగేలా చేస్తారో!

మరింత సమాచారం తెలుసుకోండి: