ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం ఉన్నత స్థాయి సలహా కమిటీని ఆ రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈమేరకు ఆదివారం దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి నారయణ నేతృత్వంలో 9 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈకమిటీలో సభ్యులుగా పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారు. కమిటీ సభ్యులుగా ఏంపీలు సుజనాచౌదరి, గల్లా జయదేవ్‌, మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌రావు, జీవీకే గ్రూప్‌ ప్రతినిధి జీవీ సంజయ్‌రెడ్డి, జీఎంఆర్‌ గ్రూప్‌ ప్రతినిధి బొమ్మిడాల శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. ఈ కమిటీ తన నివేదికను మూడు నెలల్లోగా రూపొందించనుంది. ఆరు నెలల్లో రాజధాని నిర్మాణం పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా జూలై నెలాఖరు కెల్లా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన రాజధానిపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రాజధాని వ్యవహారంపై చర్చించేందుకు సోమవారం సలహా కమిటీ ఛైర్మన్‌ మంత్రి నారాయణ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీతో మంత్రి నారాయణ భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిని గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొగ్గు చూపుతోంది. ఈమేరకు రాజధాని ప్రాంతం ఎంపికపై కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీకి కూడా రాష్ట్రప్రభుత్వం ఇదే అభిప్రాయాన్ని తెలియజేసింది. విజయవాడ-గుంటూరు ప్రాంతం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు మధ్యలో ఉండడం, రోడ్డు, రైల్వే, విమాన మార్గాల అనుసంధానంతోపాటు కృష్ణా నదికి రెండు వైపులా ఉండడం వల్ల మంచినీటికి కొరత ఉండదని కమిటీకి నివేదించింది.అయితే కేంద్రం దీనిపై తీసుకునే తుది నిర్ణయాన్ని అనుసరించి రాజధాని నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టనుంది. శాఖాధిపతుల కార్యాలయాలు, డైరక్టరేట్లతోపాటు అన్ని ప్రభుత్వ విభాగాలను, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టులను రాజధానిగా ఎంపికయ్యే ప్రాంతంలోనే నెలకొల్పాలని ఆమేరకు ప్రణాళికలను రూపొందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర అధికార్లను అదేశించారు. పరిపాలన, ఐటీ, పరిశ్రమలు, విద్య, వైద్యం తదితర రంగాలన్నింటినీ ఒక్క రాజధానిలోనే ఏకీకృతం చేయడం కంటే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రంగాల వారీగా ఏర్పాటు చేస్తే ఆంధ్రపదేశ్‌ రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలను అభివృద్ధి చేసినట్లుగా ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా విజయవాడ-గుంటూరు మధ్య పరిపాలనతోపాటు, విశాఖపట్టణం, కాకినాడ, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం తదితర ప్రాంతాలను అభివృద్ది చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుత రాజధాని హైదరాబాద్‌లో అన్నింటినీ ఏకీకృతం చేయడంతో ఆ ప్రాంతమే తప్ప మిగిలిన ప్రాంతాలు అంతగా అభివృద్ధి చెందలేదనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని అటువంటి పొరపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త రాజధాని విషయంలో పునరావృతం కాకూడదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాలకు అనుసంధానం చేసే వ్యవస్థ అవసరమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మరోపక్క విజయవాడ-గుంటూరులతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, తిరుపతి, ఒంగోలు తదితర ప్రధాన పట్టణాల్లోని ప్రభుత్వ భూముల వివరాలను జిల్లా కలెక్టర్ల నుండి తెప్పించుకున్న రాష్ట్రప్రభుత్వం వాటి ఆధారంగా రాజధాని ప్రాంతంలో భూముల అందుబాటును అనుసరించి ప్రణాళికలను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: