చంద్రబాబు ఎన్నికల సమయంలో అట్టహాసంగా ప్రకటించిన రైతులు, డ్వాక్రా, చేనేత రంగాల రుణాల మాఫీ బాబును వెంటాడుతోంది. రుణమాఫీపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఇదే అంశం మళ్లీ సోమవారం నిర్వహించనున్న కేబినెట్ మూడో భేటీలో చర్చకు వస్తోంది. రుణమాఫీపై విమర్శల పరంపర వెల్లువెత్తుతోంది. సమస్య నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్రభుత్వం కమిటీ వేసినప్పటికీ, కమిటీ ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేకపోయింది. రుణమాఫీపై అధ్యయనం కోసం నియామకం అయిన కోటయ్య నేతృత్వంలోని కమిటీ జూన్ 22లోపే నివేదిక ఇస్తుందని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. విశాఖపట్నంలో జూన్ 12న తొలి మంత్రవర్గ సమావేశం తర్వాత ఈమేరకు ప్రకటించారు. ప్రభుత్వ వైఖరి ఏమిటో నేటికీ స్పష్టం కాకపోవడంతో ఈ కమిటీ కూడా నివేదిక రూపొందించలేని స్థితిలో ఉంది. రాష్ట్ర మంత్రివర్గం మూడో సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరుగనుంది. మొట్టమొదటి సమావేశం విశాఖపట్నంలో జూన్ 12న నిర్వహించారు. రెండో సమావేశం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో నిర్వహించారు. ప్రస్తుతం మూడో పర్యాయం మంత్రివర్గ సమావేశం మళ్లీ హైదరాబాద్‌లోని చంద్రబాబు క్యాంప్ ఆఫీసుగా కొనసాగుతున్న లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లోనే నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం నేటికీ ‘స్టార్టింగ్ ట్రబుల్’ నుంచి బయటపడలేకపోయింది. తెదేపా ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో కీలకమైన అంశాలపై నేటికీ స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ధీనస్థితిలో ఉందని ప్రభుత్వమే ప్రత్యక్షంగా, పరోక్షంగా చెప్పుకుంటోంది. రాజధాని నిర్మాణం కోసం విరాళాలు సేకరించడంతో ప్రభుత్వ పరువు పోయింది  ఒక తెలుగు దినపత్రిక సైతం రాజధాని నిర్మాణానికి విరాళాలు సేకరించినప్పటికీ, ప్రభుత్వం అడ్డు చెప్పలేకపోయింది. రాజధాని నిర్మాణం అంటే ప్రధానంగా శాసనసభ, శాసనపరిషత్తు, రాష్ట్ర సచివాలయం, హైకోర్టు, రాష్ట్ర హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్ తదితర భవనాలు వస్తాయి. వీటి నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వ సాయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవిధంగా పరిష్కరిస్తారన్న ప్రశ్న ఉద్భవిస్తోంది. ప్రభుత్వం ముందున్న సమస్యల్లో తక్షణమే పరిష్కరించాల్సిన అంశాలు రెండున్నాయి. రైతులకు రుణమాఫీ ఒక అంశం కాగా, తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మరో అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: