కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ నిరుద్యోగుల్లో.. ప్రత్యేకించి ఓయూ విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణం కావడంతో.. వారిని బుజ్జగించేందుకు కేసీఆర్ సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా టీపీఎస్సీ ఏర్పాటు చేసి.. ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోంది. టీపీఎస్సీ ఏర్పాటు కోసం తెలంగాణ సర్కారు ఇప్పటికే కేంద్రంతో ఈ దిశగా జరిపిన సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చాయి. అధికారుల అంచనాను బట్టి నెలరోజుల్లో కమిషన్ ఏర్పాటు కాబోతోంది. కమిషన్ ఏర్పాటు లాంఛనాలు పూర్తికాగానే నిరుద్యోగులకు ఇచ్చిన హామీమేరకు భారీగా నియామకాల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలోని ఉద్యోగాల ఖాళీల వివరాలు సేకరించి వీలయినంత త్వరలో పంపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక సమాచారం మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో దాదాపు 20 వేల పైచిలుకు ఉన్నత స్థాయి పోస్టులు భర్తీ కావాల్సి ఉంటుంది. వీటిలో కీలకమైన గ్రూప్-1 పోస్టులతోపాటు గ్రూప్-2, గ్రూప్-4 పోస్టులున్నాయి. వీటి భర్తీకి వెనువెంటనే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా కసరత్తు చేస్తోంది. ఇవి కాకుండా డీఎస్సీల ద్వారా 20 వేల టీచర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. పోలీస్ శాఖలో ఖాళీలపైనా కేసీఆర్ సర్కారు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ శాఖలో దాదాపు 15 వేల పోలీస్ పోస్టుల భర్తీ జరిగే అవకాశం ఉంది. ఇతర నియామక సంస్థలైన టీఎస్‌ఆర్‌టీసీ, ట్రాన్స్‌కో, జెన్‌కో వంటి ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరుగనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఇప్పటికి హామీ ఇచ్చినందువల్ల.. వెనక్కు తగ్గే అవకాశం లేదు. అందువల్ల ఉద్యోగాల భర్తీ జోరుగా నిర్వహించి వారి ఆగ్రహానికి గురికాకుండా ప్రయత్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: