ఏపీ రాజధాని నిర్మాణం కోసం నిధుల సేకరణ లో భాగంగా ఏపీ సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసిన హుండీలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ హుండీల విషయంలో అనేక మంది చతుర్లాడుతున్నారు. ఒకవైపు రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు కావాలి అంటూనే... మరోవైపు ఇలా హుండీలు ఏర్పాటు చేయడం పట్ల అనేకమంది ఆశ్చర్యపోతున్నారు. ఎన్ని హుండీల సొమ్ము వస్తే రాజధానిని నిర్మించాడానికి డబ్బు సరిపోతుంది? అంటూ.. అనేక మంది ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఏదో ప్రయత్నం చేస్తన్నారు.. చేయనీ అన్నట్టుగా చూస్తున్నారు. అయితే ఈ హుండీల్లో ఎంత డబ్బు పడుతుంది? వీటిని ఎప్పుడు ఓపెన్ చేస్తారు? మీడియా ఎదుట చేస్తారా.. లేక అధికారులు పర్సనల్ గా ఓపెన్ చేస్తారా? హుండీల్లోని డబ్బు దుర్వినియోగం కాదా? ఈ హుండీల్లోని డబ్బు పై అధికారులు ఎవరూ చేతివాట ప్రదర్శించరు కదా? అనే సందేహాలు, అనుమానాలు నెలకొన్నాయిప్పుడు. ఒకవేళ ఈ హుండీల్లో ఎంత డబ్బు పడిందో ప్రకటిస్తే..అది చర్చనీయాంశమే అవుతుందని చెప్పవచ్చు. ఎలాగూ అంత గొప్ప స్పందన ఉండదని స్పష్టంగా అర్థమవుతోంది.సెక్రటేరియట్ లో ఉద్యోగులు ఏమైనా డబ్బు వేస్తే... హుండీలు త్వరగా నిండుతాయేమో కానీ...అక్కడి వరకూ వెళ్లి డబ్బులు వేసే ప్రజానీకం ఎవరూ ఉండకపోవచ్చు. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ హుండీల్లో తక్కువ మొత్తం పడి.. ఆ ఫిగర్ ను బయటకు ప్రకటిస్తే.. ప్రభుత్వంపై భారీ సెటైర్లే పడతాయి. కొండంత రాగం తీసి... అన్నట్టుగా అనేక మంది చంద్రబాబు ప్రభుత్వ హుండీల ఏర్పాటు నిర్ణయంపై జోకులు వేస్తారు! వాటన్నింటినీ భరించడానికి ప్రభుత్వం రెడీగా ఉండాలేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: