ఒక్కొక్క రైతు కుటుంబానికి లక్షన్నర రూపాయల వరకు, డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. చేనేత కార్మికులకు కూడా రుణ మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఎంసెట్‌ కౌన్సిలింగ్‌, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ విషయంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ తీర్మానించింది. త్వరలోనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపాలని నిర్ణయించింది. కాకినాడలో ఎల్‌ఎంజి టెర్మినల్‌కు అనుమతి మంజూరు చేసింది. ఎన్టీఆర్‌ సృజల స్రవంతి ద్వారా రూ.2కే 20 లీటర్ల త్రాగునీటి సరఫరా పథకానికి ప్రణాళిక రూపొం దించాలని, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ లో భాగంగా తక్షణమే 10 వేల మెట్రిక్‌ టన్నుల ఉల్లిపాయలు కొనుగోలు చేసి ప్రజానీకానికి అందిం చాలని, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను క్రమబద్దీ కరించేందుకు ఆర్డినెన్స్‌ తేవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం రెండున్నర గంటల పాటు మంత్రి మండలి సమావేశం సుదీర్ఘంగా జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం నిర్ణయాల ను ముఖ్యమంత్రే స్వయంగా పత్రికల వారికి వివరించారు. రుణమాఫీకి సంబంధించి రిజర్వ్‌ బ్యాంకుపై ఆధారపడకుండా స్వంతంగానే నిధులు సమీకరించాలని నిర్ణయించామన్నారు. ఆదా యాలు, ఆస్తులను కుదవపెట్టడం ద్వారా నిధులు సమీకరిస్తామని, దీనికిగాను నిధుల సమీకరణ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కొక్క రైతు కుటుంబం ఎందరి పేర్లతోనైనా ఎంతమొత్తం పంట రుణాలుగా తీసుకున్నప్పటికీ అలాగే బంగారం రుణంతో సహా ఆ కుటుంబంలోని అందరు తీసు కున్న మొత్తాలను కలిపి ఒక రుణం కిందనే లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీన కటాఫ్‌ డేట్‌గా నిర్ణయించి ముందుకు సాగుతామన్నారు. రుణాలు తిరిగి చెల్లించిన వారికీ, చెల్లించని వారికీ దీన్ని వర్తింప జేస్తామన్నారు. లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ ప్రకటించినందున 96.27 శాతం రైతు కుటుంబాలకు నూటికి నూరు శాతం రుణమాఫీ జరుగుతుందని, 3.73 శాతం మందికి లక్షా 50 వేల వరకు రుణమాఫీ జరుగుతుందని ఆయన వివరించారు. మొత్తం 37 వేల కోట్ల వరకు రుణమాఫీ వల్ల భారం పడుతుందని భావిస్తున్నామన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం చూస్తే రూ.15,839 కోట్లు అప్పు తెచ్చుకోవచ్చని, అయితే మొత్తం రుణమాఫీలకు రూ.37,900 కోట్ల వరకు అవసరమవుతుందని, రిజర్వ్‌బ్యాంకు ద్వారా అప్పుఅర్హత రూ.25 వేల కోట్ల వరకు మాత్రమే ఉంటుందని ఆయన వివరించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.16 వేల కోట్ల లోటు ఉంటుందని, ఆర్థిక పరంగా ఎన్ని సమస్యలున్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు రైతులు బాగుపడాలి, పేదల అభ్యున్నతి జరగాలి అన్న లక్ష్యంతోనే రుణమాఫీపై నిర్ణయం తీసుకున్నామన్నారు. కౌలు రైతుల విషయంలో కూడా తగిన చర్యలు తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌ నుండి రుణమాఫీకి సంబంధించి నిధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నందున ఇక ప్రభుత్వమే స్వంతంగా ప్రైవేటుగా నిధులు సమీకరించి రుణమాఫీకి వాటిని వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి వివరించారు. ఇందుకు గాను వివిధ మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. గనులు, ఇసుక త్రవ్వకాల ద్వారా వచ్చే ఆదాయానికి ఎస్క్రో ఎకౌంట్‌ను తెరచి ఆ డబ్బుల్ని అప్పుగా సేకరించడం, రవాణ, ఎక్సైజ్‌ శాఖలకు వచ్చే ఆదాయంలో కొంతభాగాన్ని రైతుల సంక్షేమ నిధి పేరిట జమ చేయడం, పట్టుబడ్డ ఎర్రచందనాన్ని విక్రయించటం ద్వారానూ, ఎర్రచందనం అడవులను తనఖా పెట్టడం ద్వారానూ నిధులు సమీకరించాలని భావిస్తున్నట్లు చంద్రబాబునాయుడు వివరించారు. రైతు రుణాల రీషెడ్యూల్‌కు సంబంధించి ఇంకా ఆర్‌బిఐ నుండి వివరాలతో కూడిన లేఖ ప్రభుత్వానికి అందలేదన్నారు. ఒక ఏడాది మారిటోరియంతో పాటు ఏడేళ్ళ పాటు రీషెడ్యూల్‌ చేయాలని ప్రభుత్వపరంగా రిజర్వ్‌ బ్యాంకును కోరామని, అయితే ఒక ఏడాది మారిటోరియంతో పాటు రెండేళ్ళపాటు రీషెడ్యూల్‌ చేసేందుకు రిజర్వ్‌బ్యాంక్‌ అంగీకరిస్తున్నట్లు తెలుస్తోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: