గత 15రోజులుగా మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణానది, జూరాల ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరదనీరు వచ్చి చేరుతున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం నాటికి ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి జలాశయంలో 512.570మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ప్రాజెక్టుకు 78,459 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు వారు తెలిపారు. ఆల్మట్టి పూర్తిస్థాయి నీటిమట్టం 519.60 మీటర్లు. నారాయణపూర్ జలాశయంలో 487.860 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 492.460 మీటర్లు. జూరాల ప్రాజెక్టులో 315.25మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా కృష్ణానది, జూరాల పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షపునీరు 250 క్యూసెక్కులు ప్రాజెక్టులో చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: