2014 ఎన్నికలకు ముందు కుమార్ విశ్వాస్ ఓ ప్రొఫెసర్. అంతకంటే మంచి కవి. ఆమ్ ఆద్మీ పార్టీ విధి విధానాలు నచ్చి అందులో చేరారు. అప్పుడప్పుడు కవితాత్మకంగా ప్రతిపక్ష నేతలపై చలోక్తులు విసురుతూ వార్తల్లోకెక్కారు. అమేథిలో రాహుల్ గాంధీపై పోటీకి కుమార్ విశ్వాస్ ను దింపడంతో ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ముక్కు మొహం తెలియని వ్యక్తిని ఏకంగా రాహుల్ పైనే పోటీకి దింపడం వెనుక ఆప్ స్ట్రేటజీ ఏంటని పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఎన్నికల ప్రచారంలోనూ విశ్వాస్ కు అనూహ్య స్పందన లభించడంతో ఆయన గెలుపు ఖాయమనుకున్నారు. కాని రాహుల్ చేతిలో విశ్వాస్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. అంతే అప్పటితో తెరమరుగైన విశ్వాస్ మళ్లీ కొత్త న్యూస్ తో వార్తల్లోకెక్కారు. ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ నిర్మాతలు కుమార్ విశ్వాస్ ను ఆహ్వనించారు. తమ షోలు పాల్గొనాలని వెల్ కం పలికారు. అంతేకాదు రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంటే ఏకంగా ఐదు కోట్లిస్తామని ఆఫర్ చేశారు. ప్రస్తుతం కుమార్ విశ్వాస్ బిజీగా గడుపుతున్నారు. జులై 29న సిలికాన్ వ్యాలీలో గూగుల్ హెడ్ క్వార్టర్స్ లో సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగం, తర్వాత కాలిఫోర్నియాలో స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో రాజకీయాలపై అతిథి ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొనే అంశంపై విశ్వాస్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. సెప్టెంబర్ లో బిగ్ బాస్ న్యూ సీజన్ ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: