విద్యుత్ కోసం ఏపీ, తెలంగాణ కుస్తీపడుతుంటంతో హిందూజా విద్యుత్ కేంద్రం ప్రతినిధులు ఎవరికి విద్యుత్ ఇవ్వాలో తేల్చుకోలేక తలపట్టుకుంటున్నారు. విభజన వివాదం తమకు చుట్టుకోవడంతో... ఎవరి మాట వినాలో తేల్చుకోలేకపోతున్నారు. హిందూజా థర్మల్ కేంద్రంలో తమ వాటా విద్యుత్ ను ఇవ్వటానికి తక్షణమే పీపీఏ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆ సంస్థ ప్రతినిధులను కోరింది. విశాఖపట్నంలోని హిందూజా విద్యుత్ కేంద్రం నిర్మాణంలో వెయ్యికిపైగా మెగావాట్ల ఉత్పత్తికి సిద్దమైంది. ఈ విద్యుత్ మొత్తం ఆంధ్రప్రదేశ్ కే చెందుతుందని ఆ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మరి తమ వాటా సంగతేంటని ఆ సంస్థ ప్రతినిధులను తెలంగాణ రాష్ట్ర ఇంధనశాఖ అధికారులు అడుగుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య పీపీఏల గొడవ ఉన్నందున దీనిపై ఆలోచించుకోటానికి పదిరోజుల సమయం కావాలని హిందూజా ప్రతినిధులు తెలంగాణ విద్యుత్ అధికారులను కోరారు. తెలంగాణ ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి, ట్రాన్స్ కో సీఎండీ రిజ్వీ హిందూజా సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన చట్టంలో చెప్పినట్లుగా జీఓ నెంబర్ 20 ప్రకారం తమవాటాగా 53.89 శాతం విద్యుత్ ఇవ్వాలని తెలంగాణ అధికారులు కోరారు. విద్యుత్ సరఫరాలపై రెండు రాష్ట్రాలు పోటీ పడుతున్న తరుణంలో హిందూజా ప్రతినిధులు ఈ సమావేశంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోయారు. ముంబైలోని ప్రధాన కార్యాలయంతో సంప్రదించి నిర్ణయం ప్రకటిస్తామని.., పది రోజుల గడువు కావాలని ఆ సంస్థ ప్రతినిధులు అధికారులతో చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: