సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి ఘర్షణ వైఖరి తప్పదనిపిస్తోంది. మొన్నటి వరకూ సద్దుమణిగిన హైదరాబాద్ పై గవర్నర్ పెత్తనం వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. ఏపీ కోరిక మేరకు.. జంటనగరాల పోలీసింగ్‌ వ్యవస్థపై గవర్నరు సర్వాధికారాలు కలిగివుండే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడం తప్పదని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను తెలంగాణ గట్టిగా వ్యతిరేకిస్తున్నా.. ఈ విషయంపై ముందుకే అడుగేయాలని మోడీ సర్కారు భావిస్తోందట. కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కసరత్తును దాదాపు పూర్తి చేసిందని, గవర్నర్‌ పెత్తనానికే అనుకూలమని స్పష్టంగానే చెప్పనుందని ఢిల్లీలో పుకార్లు షికారు చేస్తున్నాయి. గవర్నర్ పెత్తనం విషయంపై ఇప్పటికే కేంద్రం తెలంగాణ సర్కారు అభిప్రాయం కోరింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకంచిన కేసీఆర్ సర్కారు.. ఆమేరకు తన అభిప్రాయం తెలుపుతూ ఉత్తరం రాశారు. ఐతే ... తెలంగాణ అభిప్రాయం కోరడం కేవలం లాంఛనమేనని.. కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసేసుకుందని సమాచారం. పోలవరం ఆర్డినెన్సు తరహాలో ఈ విషయంలోనూ తెలంగాణ అభ్యంతరాలను బేఖాతరు చేయాలని మోడీ సర్కారు నిర్ణయించిందట. ఎందుకంటే.. ఈ వ్యవహారం కొత్తదేమీ కాదు. ఆల్రెడీ.. విభజన బిల్లులో పొందుపరిచిన విషయమే. విభజనచట్టం ప్రకారం హైదరాబాద్ .. జీహెచ్ఎంసీ ప్రాంతం.. పదేళ్ల పాటు రెండు రాష్ట్రా లకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. నగరం ఉమ్మడిగా ఉన్నంత వరకు ఇక్కడ శాంతి భద్రతల వ్యవహారం, పోలీసింగ్‌పై పెత్తనం గవర్నరు చేతుల్లో ఉంచాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారుల్ని జంట నగరాల్లో నియమిస్తారు. ఇక్కడ శాంతిభద్రతల వ్యవహారం అంతా గవర్నరు ఆధీనంలో నడుస్తుందన్నది తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. నగరంలో ఒక సీఐ ట్రాన్స్‌ఫర్‌ అయినా గవర్నరు ఇష్టానుసారమే జరుగుతుంది. ఈ విషయంలో తెలంగాణ ఎంత గింజుకున్నా.. వ్యతిరేకత వ్యక్తం చేసినా సాధించేది ఏమీ ఉండదని ఏపీ నాయకులు చెబుతున్నారు. అన్ని విషయాలూ తమకే అనుకూలంగా ఉండాలని కోరుకోవడం తగదని సూచిస్తున్నారు. ఓ పదేళ్లు ఓపిక పడితే... హైదరాబాద్ తెలంగాణాదే కదా అని బదులిస్తున్నారు. మరి కేసీఆర్.. ఈ విషయంపై ఎలా స్పందిస్తారో .. కేంద్రం వ్యూహాలను ఎలా ఎదుర్కొంటారో..

మరింత సమాచారం తెలుసుకోండి: