రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో చేస్తున్న జాప్యం వల్ల స్టూడెంట్స్ తీవ్రంగా నష్టపోతున్నారని అన్ని పార్టీల నాయకులు ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలాగే ప్రభుత్వం పనిచేస్తే ఆందోళనలు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ రోజు తెలంగాణ ఇంజనీరింగ్ అండ్ ప్రొఫెషినల్ కాలేజ్ మేనేజ్ మెంట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని పార్టీల నాయకులు వచ్చారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, రాములు నాయక్ వచ్చారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీడీపీ నుంచి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య వచ్చారు. బీజేపీ నుంచి ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే లక్ష్మణ్ వచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో 1956 స్థానికత చేయడం సరికాదన్నారు రేవంత్ రెడ్డి. దీని వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని ఆయన అన్నారు. ప్రభుత్వం దక్షిణ తెలంగాణపై వివక్ష చూపిస్తుందని ఆయన ఆరోపించారు. ఇలానే జరిగితే దక్షిణ తెలంగాణ ఉద్యమం తప్పదన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారాయన. టీఆర్ఎస్ ఎంపీ రాములు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సరైన విధివిధానాలు రాకముందే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. రీయింబర్స్ మెంట్ తర్వాత ప్రైవేట్ ఆగడాలు పెరిగాయని కర్నె ప్రభాకర్ అన్నారు. సమావేశంలోని చర్చను సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. మొత్తానికి ఫీజు రీయింబర్స్ మెంట్ రగడ కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: