తెలంగాణలో గృహాల నిర్మాణం సందర్భంగా జరిగిన అవినీతిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడి విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. శనివారం సచివాలయంలో గృహానిర్మాణశాఖ సమీక్షా సమావేశం జరిగింది. 2004 నుండి 2014 సంవత్సరం వరకు దశాబ్దం కాలం పాటు గృహ నిర్మాణ పథకంలో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు. ఆ బాధ్యతను సిబిసిఐడికి అప్పగించారు. 2006-2014 సంవత్సరం మధ్యలోనే 22 లక్షల 40 వేల నిర్మాణం పూర్తయినట్లు లెక్కలు చూపుతున్నా వాటిలో ఎన్ని కట్టారు? ఎన్ని కట్టలేదు? అనే విషయంలో స్పష్ట లోపించిందని సిఎం అన్నారు. గృహనిర్మాణ పథకంలో అవకతవకలపై అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి అవకతవకలపై గత ప్రభుత్వాలు గుర్తించి థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించడంతో పాటు శాఖా పరమైన విచారణ జరిపించాయి. 490 మంది అధికారులను సస్పెండ్‌ చేశారు. మరో 256 మంది డిస్మిస్‌ చేశారని గతంలో తీసుకున్న నిర్ణయాలను అధికారులు ముఖ్యమంత్రికి లెక్కలు చూపారు. కొంతమంది జైల్లో ఉన్నా, వారిలో కొంతమంది రాజకీయ నేతలు బెయిల్‌పై బయటకు వచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ మాట్లాడుతూ తన హయాంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 593 గ్రామాల్లో ర్యాండమ్‌ సర్వే విచారణ జరిగిందని, 235 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగినట్లు బయటపడిందని చెప్పారు. కట్టబడినట్లు చెబుతున్న 36 వేల ఇండ్లు అసలు కట్టడమే జరగలేదన్నారు. కాంట్ట్రార్లు బిల్లులు క్లెయిమ్‌ చేశారని ఆయన అధికారుల ముందు లెక్కలు చూపారు. అసలు జరిగిన అవకతవకలన్నీ 75 శాతం మేర 2008-2009 సంవత్సరాల మధ్య కాలంలోనే జరిగాయని, ఆ కాలంలో గృహనిర్మాణ సంస్థకు ప్రభుత్వం 5000 కోట్లు విడుదల చేస్తే, మంజూరైన ఇళ్ల సంఖ్య 13 లక్షలని సిఎం తెలిపారు. ఈ అవినీతి తర్వాత కాలంలోనూ జరిగిందని పేర్కొన్నారు. ఇళ్ల భాగోతాన్ని తాను అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపించాలని ముక్తకంఠంతో కోరాయని, తాము ఈ విషయంలో పూర్తి సహకారం అందిస్తామని చెప్పారని సిఎం కెసిఆర్‌ అధికారులకు గుర్తు చేశారు. చాలా గ్రామాల్లో ఇళ్లు కక్టబడి ఉన్నప్పటికీ, 99 శాతం మందికి ఇళ్లు కట్టిచ్చి ఇచ్చామని చెప్పినప్పటికీ వాస్తవానికి ఒక్క ఇల్లు కూడా కట్టిన దాఖలాలు లేవని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 45000 ఇళ్లు, మంథని నియోజకవర్గంలో 41,099 ఇళ్లు, కొడంగల్‌ నియోజకవర్గంలో 32,337 ఇళ్లు, పరిగి నియోజకవర్గంలో 30416 ఇళ్లు కట్టబడినట్లు చెబుతున్నా అవన్నీ తప్పుడు లెక్కలేనన్ని సిఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి మరో 4,60,000 ఇళ్లు ఇంకా నిర్మాణంలో ఉన్నాయని కూడా అధికారిక లెక్కలు చెబుతున్నాయని అన్నారు. ఈ అవకతవకలు ఒక్క గృహ నిర్మాణంలోనే గాకుండా పెన్షన్ల వ్యవహారంలోనూ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లోనూ, రేషన్‌కార్డుల పంపిణీ, తదితర రంగాల్లో ఒక రకమైన భయాకన పరిస్థితి నెలకొందని సిఎం అభిప్రాయపడ్డారు. అవినీతి తారాస్థాయికి చేరుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు అసలైన లబ్ధిదారులో? ఎవరు కారో? అనే విషయం తేలాలన్నారు. మొత్తం వ్యవహారాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఒక్క పైసా దుర్వినియోగం జరిగినా శిక్ష తప్పదన్న భయం కలగాలని ఆయన అన్నారు. త్వరలోనే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వున్న 83,59.000 కుటుంబాలకు సంబంధించి సమగ్ర సర్వే జరుపుతుందని అన్నారు. ప్రభుత్వంలోని నాలుగు లక్షల మంది ఉద్యోగుల ద్వారా కేవలం ఒకేరోజు పూర్తయ్యేవిధంగా రాష్ట్ర వ్యాప్త సమగ్ర సర్వే జరుగుతుందన్నారు. దీనిపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఆర్డిఓలు, ఎమ్మెర్వోలతో ఆగస్టు మొదటి తేదీన హైదరాబాద్‌లో సన్నాహక సదస్సు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. సమగ్ర సర్వే ద్వారా అసలు సిసలైన లబ్ధిదారులను గుర్తించి గృహనిర్మాణ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: