శివరామకృష్ణన్ కమిటీ.. రాష్ట్ర రాజధానిని ఎంపిక చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ.. ఈ కమిటీ ఇప్పటికే సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 8 జిల్లాలు పర్యటించింది. ఇంకో ఐదు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. ఇప్పటికే రాజధాని విషయంపై సమగ్ర పరిశీలన జరుపుతున్న కమిటీ.. విస్తృతంగా అధ్యయనం చేస్తోంది. అయితే ఎంత విస్తృత పరిశీలన చేసినా.. ఈ కమిటీ మరో శ్రీకృష్ణ కమిటీలాగానే మారబోతోందన్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధాని చేయాలని ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. శివరామకృష్ణన్ కమిటీ మాత్రం ఈ ప్రాంతం అంత అనుకూలంకాదని చెబుతోంది. అందుకు కారణం అక్కడ ఎక్కువగా ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడమే.. ప్రైవేటు భూములు కొని రాజధాని కట్టడం తలకుమించిన పని అవుతోందని చెబుతోంది. కానీ శివరామకృష్ణన్ కమిటీ మాట రాష్ట్రప్రభుత్వం వినే పరిస్థితిలో లేదు. ఇందుకు మంత్రి పి.నారాయణ ఇచ్చిన సమాధానమే ఉదాహరణ. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చే నివేదికను తమ ప్రభుత్వం పరిశీలిస్తుందని.. దాన్ని అమలు చేయాలన్న రూలేంలేదని ఆయన చల్లగా సెలవిచ్చారు. అలాగైతే.. అసలు ఆ కమిటీ వేయడం దేనికి.. ప్రజాధనం వృధా చేయడం దేనికన్న వాదనలు వినిపిస్తున్నాయి. శివరామకృష్ణన్ కూడా ఇంచుమించు ఇదే విషయం వెల్లడించారు. తాము ఏ ప్రాంతానికి వ్యతిరేకంగానూ అనుకూలంగానూ లేమని వివరించారు. రాజధాని ఫలానా ప్రాంతంలో ఏర్పాటు చేయాలని తాము సూచించమని.. ఆయన తెలిపారు. ఒక ప్రాంతం గురించి స్పష్టంగా చెప్పకుండా... రెండుమూలు ఆప్షన్లు ఇస్తామని... ఒక్కోదానికున్న మంచి, చెడు లక్షణాలను కూడా వివరిస్తామని శివరామకృష్ణన్ చంద్రబాబుతో అన్నారు. దాన్నిబట్టి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి రాజధానిని ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. గతంలో శ్రీకృష్ణ కమిటీ కూడా ఆరు ఆప్షన్లు ఇచ్చింది. కేంద్రం వాటిని అంతగా పట్టించుకోకుండానే తన నిర్ణయం తాను తీసుకుంది. ఇప్పుడు రాజధాని విషయంలోనూ అదే జరిగేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: