రాజధాని.. రాజధాని.. రాజధాని.. ఇప్పుడు సీమాంధ్రలో దీన్ని మించిన హాట్ టాపిక్ లేదు. రాజధాని ఎక్కడ కడతారు.. ఏ ప్రాంతానికి అవకాశం ఉంది. కడితే ఎలా కడతారు. ఏ నగరం మోడల్లో కడతారు. ఏఏ సౌకర్యాలు కల్పిస్తారు.. ఇలా అన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలే. అయితే.. రాజధాని ఎక్కడ కడతారన్న దానిపై ఇప్పటికే ఏపీ సర్కారు ఓ క్లారిటీకి వచ్చినట్టు కనిపిస్తోంది. బెజవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని డిసైడైనట్టు సమాచారం. అయితే ఏ ప్రాంతం రైతులు పెద్ద సంఖ్యలో భూములు ఇస్తే అక్కడ కడతామని చంద్రబాబు లేటెస్టుగా ట్విస్టు ఇచ్చారు. భూముల లభ్యతను బట్టి చూసుకుంటే.. ప్రకాశం జిల్లా దొనకొండ కూడా రేసులో ముందుకొస్తుంది. ఆల్రెడీ కర్నూలును రాజధాని చేయాల్సిందేనని అడపాదడపా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. పాత రాజధాని నగరంగా ఆ ప్రాంతప్రజలకు ఆ వెసులుబాటు, హక్కు ఉన్నాయి. కానీ విచిత్రంగా రాజధాని రేసులో అంతగా విననిపించిన నగరం ఒకటి కొత్తగా పరుగులోకి వచ్చింది. అదే నెల్లూరు. ఇంతకు ముందు విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, మంగళగిరి, కాకినాడ, కర్నూలు నగరాల పేర్లు రాజధాని రేసులో వినిపించాయి. తాజాగా నెల్లురు పేరు వినిపిస్తోంది. నెల్లూరు పేరు అకస్మాత్తుగా వినిపించడానికి కారణం.. తాజా శివరామకృష్ణన్ కమిటీ చంద్రబాబును కలిసినప్పుడు.. రాజధానిగా ఉన్న సానుకూలతలపై ఓ రిపోర్ట్ ఇచ్చారట. అందులో బెజవాడ, విశాఖ, నెల్లూరు నగరాలకు రాజధానిగా ఉన్న సానుకూలతలు, మైనస్ పాయింట్లు అన్నీ కూలంకషంగా వివరించారట. కేంద్రం నియమించిన కమిటీగా దీనికి ఓ హోదా ఉంది. అందుకే అనూహ్యంగా నెల్లూరుకు రాజధాని అవకాశం దక్కుతుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏమో ఏమైనా జరగొచ్చు. కాదనలేం కదా..

మరింత సమాచారం తెలుసుకోండి: