లోటు బడ్జెట్ లో ఉన్నామనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెప్తున్న మాట. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు విషయంలో అయినా... రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసమైనా... ప్రజల నుంచి విరివిగా విరాళాలు సేకరించాల్సి వస్తోంది. విపరీతమైన కష్ట కాలంలో ఉన్న ఏపీ ఖజానాకు కోట్లాది రూపాయలు వచ్చి చేరనున్నాయి. అటవీశాఖ డిపోల్లో పేరుకు పోయిన ఎర్రచందనం వేలం వేయడం ద్వారా ప్రభుత్వానికి ఈ ఆదాయం చేకూరనుంది. ఎక్కడా ఆలస్యం చేయకుండా ఖరీదైన అటవీ సంపదను వేలయం వేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతోంది. ఇప్పటికే ఎర్రచందనం కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లు ఆహ్వానించిన చంద్రబాబు ప్రభుత్వం... తాజాగా రేటు నిర్ణయిస్తూ జీఓ జారీ చేసింది. క్వాలిటీని బట్టి ఎర్రచందనంను నాలుగు గ్రేడులుగా విభజించారు. ఒక మెట్రిక్ టన్ను నాన్ గ్రేడ్ రకానికి 7 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఏ, బీ, సీ రకాలకు వరుసగా 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షల రూపాయల కనీస ధర నిర్ధారించారు. ఈ-టెండర్లు, ఈ-ఆక్షన్ పద్దతి ద్వారా వేలం నిర్వహించనున్నారు. వేలం ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఎంఎస్టీసీ అనే సంస్థతో ప్రభుత్వం ఎంఓయూ చేసుకంది. దీంతోపాటు ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, మరికొన్ని సంస్థలు కన్సల్టెన్సీగా పని చేయనున్నాయి. వీటికి వేలం ధరలో 2 శాతంను ఫీజుగా చెల్లించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వద్ద 11 వేల టన్నుల ఎర్రచందనం ఉంది. దీనిలో 8584 మెట్రిక్ టన్నులను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనుమతిచ్చింది. ఏపీ ప్రభుత్వం తొలి దశలో 4 వేల మెట్రిక్ టన్నులు, మలిదశలో మిగతా మొత్తాన్ని విక్రయించనుంది. వేలంలో దేశ, విదేశీ కలప డిపోలు, వ్యాపార సంస్థలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. డిమాండ్ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రెండు నుంచి నాలుగు రెట్లు అదనంగా వస్తుందని అంచనా ఉంది. ఒక్కో మెట్రిక్ టన్నుకు 20 నుంచి 30 లక్షల రూపాయల సరాసరి ధర పలికినా... ప్రభుత్వ ఖజానాకు తొలిదశలో 2 నుంచి 3 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చి చేరనుంది. అయితే ఎర్రచందనం వేలం ద్వారా వచ్చిన ఆదాయంలో 30 శాతాన్ని చెట్ల సంరక్షణకే కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయినా ఇంకా భారీ మొత్తమే లోటు బడ్జెట్ తో ఏపీ ప్రభుత్వానికి కొంత ఊరట కలిగించడం మాత్రం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: