అటు ఆంద్రప్రదేశ్, ఇటు తెలంగాణ మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా రియల్టర్ల దృష్టంతా ఇప్పుడు ఏపీ పైనే ఉంది. కొత్త రాజధాని నిర్మాణం నేపథ్యంలో ఇక్కడ భూముల కొనుగోల్లు ఊపందుకున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం, అనంతపురం, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో రియల్ దందా జోరుగా సాగుతోంది. పరిపాలనా కేంద్రాలన్నీ ఒకచోట, ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం వంటి సముధాయాలు అక్కడక్కడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆలోచనలకు అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూములకు గిరాకీ ఏర్పడింది. అయితే ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని రియల్ మాఫియా రెచ్చిపోకుండా కల్లెం వేయాలని చూస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. భూముల కొనుగోళ్ల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురానుంది. ఈ ఆర్డినెన్స్ ద్వారా భూముల ధరల పెరుగుదలను నియంత్రించవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వమే నేరుగా భూముల రేట్లను నిర్ధారించే విధంగా మార్పులు చేయనున్నారు. దీని ప్రకారం రాజధానితోపాటు ఇతర సంస్థలు నిర్మించాలనుకున్న ప్రాంతాన్ని ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. నోటిఫై చేసిన ప్రాంతాల్లో భూముల ధరలు పెరగకుండా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. అవసరమైతే నోటిఫై చేసిన ఏరియాలో భూముల అమ్మకాలను పూర్తిగా నిషేధించే హక్కు కూడా ప్రభుత్వానికి వస్తుంది. అన్నిటికీ మించి ప్రభుత్వం భూములు సేకరించాలనుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఈ ఆర్డినెన్స్ ఉపకరించనుంది. ఇప్పటికే ఆంధ్రాతోపాటు రాయలసీమలోనూ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రికార్డు స్థాయిలో భూములు చేతులు మారుతున్నాయన్న సమాచారం ప్రభుత్వం దగ్గర కూడా ఉంది. కానీ ఎక్కడా రిజిస్ట్రేషన్లు మాత్రం జరగడం లేదు. కేవలం దస్తావేజులు రాసుకోవడం, జీపీఏ పద్దతిలో మాత్రమే క్రయ విక్రయాలు నడుస్తున్నాయి. రియల్ వ్యాపారులు, బడా కంపెనీలు కూడా అమాంతం ధరను పెంచి రైతుల నుంచి ఒకేసారి వందల ఎకరాల వరకూ కొనేస్తున్నారు. ప్రభుత్వం భూముల ధరలు పెంచిన తర్వాత వీటిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని భూ వ్యాపారు ఆలోచనగా ఉంది. అయితే వీటికి అడ్డుకట్ట వేసి అటు అమాయక సామాన్యులు, ఇటు ప్రభుత్వం ఇబ్బందుల్లో పడకుండా చూసేందుకే ఆర్డినెన్స్ తీసుకురానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: