జూలై రెండుతోనే ఆంధ్రా, తెలంగాణాల కలహాల కాపురం వేరుపడినా.. ఇంకా విభజన సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. వాటిలో భవనాల పంచాయతీ ఒకటి. విభజన లెక్కల్లో ఏపీ అసెంబ్లీకి కేటాయించిన భవనంపై ఇప్పటికే ఎమ్మెల్యేల నుంచి అసంతృప్తులు వెలువడ్డాయి. ఇలాంటి ఇరుకు బిల్డింగులో సభ జరుపుకునేకంటే.. బెజవాడ వెళ్తే బెటర్ కదా అని చాలా మంది బాహాటంగానే కామెంట్ చేశారు. మరో నెల రోజుల్లో రెండు రాష్ట్రాల అసెంబ్లీలు ఒకే సమయంలో సమావేశమయ్యే అవకాశం ఉండటంతో మరోసారి భవనాలు పంచాయతీ తెరమీదకు వస్తోంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు నెల మూడో వారంలో ప్రారంభం కానున్నాయి. ఇవి ఖచ్చితంగా నెలరోజుల పాటు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన శాసన సభ సమావేశాలు కూడా ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలో జరుగుతాయి. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల సభలు విడివిడిగా జరిగినా ఒకేసారి మాత్రం జరగలేదు. మాకు మంచి బిల్డింగు ఇవ్వలేదంటూ ఇప్పటికే సభాపతి కోడెల శివప్రసాద్, మండలి ఛైర్మన్ చక్రపాణి గవర్నర్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. రెండు రాష్ట్రాల సభలు ఒకే సమయంలో జరిగితే ఛాంబర్ల కేటాయింపు ఎలా అన్న విషయం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. అసెంబ్లీలో ఉన్న 32 మంత్రుల ఛాంబర్లను ఆంధ్రకు 60 తెలంగాణకు 40నిష్పత్తిలో కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. రెండు రాష్ట్రాల డిప్యూటీ స్పీకర్లకు ఇప్పుడు ఒకే ఛాంబర్ కేటాయించారు. ఈ సమస్యకు కూడా పరిష్కారం దక్కాల్సి ఉంది. రెండు రాష్ట్రాల మంత్రులకు సరిపడా ఛాంబర్ల కేటాయింపు తదితర అంశాలూ పరిష్కారం కావాల్సి ఉంది. ఇక లైబ్రరీ, కార్ల పార్కింగ్ వంటి సౌకర్యాలను కలసి పంచుకోవాల్సి ఉంది. ఈ అంశాలపై రెండు రాష్ట్రాల స్పీకర్లు ఇప్పటికే కలసి మాట్లాడుకున్నా సమస్య ఓ కొలిక్కి రాలేదు. గవర్నర్ జ్యోక్యంతోనైనా సమస్య సెటిలవుతుందా.. లేకపోతే.. అసెంబ్లీలో కొట్టుకున్నట్టుగా బిల్డింగుల కోసం కూడా ఆంధ్రా, తెలంగాణ ప్రజాప్రతినిధులు కొట్టుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: