రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 192 ప్రధాన కార్యాలయాలను 13 జిల్లాల్లో నెలకొల్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని, ఆ కార్యాలయాల భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను పరిశీలిస్తున్నట్టు రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యుడు, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. మంగళవారం రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజభవన్, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు రాజధానిలోనే ఉంటాయని, ఇవికాక రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన డైరక్టరేట్లు, కమిషనరేట్లు వంటి ప్రధాన కార్యాలయాలు మాత్రం 13 జిల్లాల్లో నెలకొల్పటం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణపై సిఎం దృష్టి పెట్టారన్నారు. దీనికోసం జిల్లాల్లో పర్యటిస్తూ జిల్లా కేంద్రాలు, రాజమండ్రి వంటి నగరాలకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.ప్రధాన కార్యాలయాలు నెలకొల్పేందుకు కనీసం ఒక్కొక్క కార్యాలయానికి 3 ఎకరాలు చొప్పున సుమారు 600 ఎకరాలు అవసరం అవుతాయన్నారు. ఈ స్థలాలకు సంబంధించిన నివేదికలను బుధవారం సాయంత్రానికి తమకు అందించాలని కలెక్టర్లను ఆదేశించామని, వీటి ఆధారంగా ఈనెల 31 సాయంత్రం 6 గంటలకు శివరామకృష్ణన్ కమిటీకి నివేదిక సమర్పిస్తామన్నారు. హైకోర్టు మాత్రం సెక్రటేరియట్ ఉన్న ప్రాంతంలోనే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి నారాయణ చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ ఇంకా ఐదు జిల్లాల్లో పర్యటించాల్సి ఉందని, తరువాత నివేదిక సమర్పిస్తుందని, నివేదిక అందిన అనంతరం రాజధాని ఎక్కడన్న అంశం నిర్ణయం జరుగుతుందన్నారు. ఇంతవరకు రాజధాని ఎక్కడనే విషయాన్ని నిర్ణయించలేదన్నారు. రాజధాని నిర్మాణానికి 25వేల ఎకరాలు సరిపోతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఉన్న ప్రాంతంలో 2.15 కోట్లమంది జనాభా ఉన్నారని, దూరం 660 కిలోమీటర్లని చెప్పారు. గుంటూరు నుంచి అనంతపురం మధ్య 2.68 కోట్లమంది ఉన్నారని, దూరం 620 కిలోమీటర్లని చెప్పారు. ఈ లెక్కన చూస్తే కృష్ణ- గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకూ సమాన దూరంలో ఉంటుందన్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. రాజధాని నిర్మాణానికి వ్యవసాయ భూములను తీసుకోవద్దని శివరామకృష్ణన్ కమిటీ సూచించిందని, ప్రభుత్వ భూములు, అవకాశం ఉన్నంత వరకు అసైన్డ్ భూములను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 11 జాతీయ విద్యా సంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని, వీటిని 13 జిల్లాల్లో నెలకొల్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారన్నారు. వాటిని నెలకొల్పేందుకు అవసరమైన స్థలాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని, 15వేల 691కోట్ల లోటు బడ్జెట్‌తో రాష్ట్రం ప్రారంభమైందన్నారు. రాజమండ్రిలో పెట్రో యూనివర్శిటీ నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోందని, సెంట్రల్ యూనివర్శిటీ, వ్యవసాయ వర్శిటీ కూడా గోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి నారాయణ చెప్పారు. గోదావరి జిల్లాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: