చంద్రబాబు, చంద్రశేఖర్ రావు.. ఈ ఇద్దరు చంద్రులు చాలాకాలం తర్వాత అధికారపగ్గాలు చేపట్టారు. ఇద్దరినీ అధికారంలోకి తెచ్చింది ఒకే హామీ అన్న అభిప్రాయం ఉంది. అదే రుణమాఫీ. హామీ ఒకటే అయినా.. దాన్ని నెరవేర్చేందుకు మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు వేరు వేరు మార్గాలు అనుసరిస్తున్నారు. అధికారం చేపట్టిన తొలిరోజుల్లోనే అతి పెద్ద హామీ అయిన ఈ రుణమాఫీపై ఇద్దరూ చర్యలు తీసుకోకతప్పలేదు. ఒకే హామీ విషయం ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలా వ్యవహరిస్తారో అని రెండు రాష్ట్రాల జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు ప్రదర్శించారని చెప్పకతప్పదు. ఆయన రుణాల రీషెడ్యూల్ కోసం ఎదురు చూడకుండా రైతుల రుణాల సొమ్మును నేరుగా బ్యాంకులకే కట్టేయాలని ఆలోచిస్తున్నారు. తొలివిడతగా పదివేల కోట్ల రూపాయలు జమ చేసి.. మిగిలిన 7 వేల కోట్లు కూడా ఒకేసారి కట్టేయాలని ఆలోచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా తెలంగాణ రైతులు త్వరగా రుణవిముక్తులు అవుతారు. మళ్లీ వాళ్లకు పంటరుణాలు దొరుకుతాయి. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో వారికి పంటరుణాలు చాలా అవసరం. మరి రుణమాఫీ విషయంలో కేసీఆర్ దూకుడుగా ఉంటే.. చంద్రబాబు ఎందుకు కిందామీదా పడుతున్నారు.. దీనికి కారణాలున్నాయి. తెలంగాణలో రుణమాఫీ హామీ విలువ.. 17 వేల కోట్లరూపాయలు మాత్రమే. అదే ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీ విలువ దాదాపు 35 వేల కోట్ల రూపాయల పైమాటే. తెలంగాణ సర్కారు మిగులు బడ్జెట్ తో ఉంది. ఆంధ్రా సర్కారు దాదాపు 17 వేల కోట్లరూపాయల లోటుతో ఉంది. అందులోనూ ఏపీని విభజన కష్టాలు వెంటాడుతున్నాయి. జీతాలిచ్చుకోవడానికే కిందామీదా పడుతున్న పరిస్థితుల్లో ఇంత పెద్ద హామీ నెరవేర్చడమంటే మాటలు కాదు. అందుకే రిజర్వ్ బ్యాంకు సాయంతో .. రీషెడ్యూల్ చేయించుకుని.. ఏడేళ్ల కాలపరిమితిలో రుణమాఫీ సొమ్ము చెల్లించాలని ఏపీ సర్కారు భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: