కొత్తగా ఓ రాజధాని నిర్మించాలంటే మాటలు కాదు... లక్షల కోట్ల వ్యవహారం. అందుకే యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇస్తామని ప్రకటించిన మరునాడే ఆనాటి ప్రతిపక్షనేత చంద్రబాబు.. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ. 5లక్షల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి సెంటిమెంట్ పరిస్థితుల్లో ఆ మాటలను ఎవరూ పట్టించుకోలేదు. అంతేకాదు. సమైక్య ఉద్యమం చేయకుండా విభజనకు అనుకూలంగా మాట్లాడతావా అంటూ విమర్శించారు. ఎంత ఉద్యమం చేసినా.. యూపీఏ తాను అనుకున్నదే చేసింది. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయంపై హామీ పొందే ప్రయత్నంపై పెద్దగా ఎవరూ దృష్టిపెట్టకపోవడం వల్ల.. ఆ విషయంలో ఏపీకి అన్యాయమే జరిగింది. ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ కూడా కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామి అయ్యింది. ఇక కేంద్రం నిధుల వరద పారిస్తుందని అంతా ఊహిస్తున్నా.. ఆ దిశగా అడుగులేమీ పడటం లేదు. కనీసం బడ్జెట్ కేటాయింపుల్లో ఆ ప్రస్తావనే లేదు. ఏపీ పునర్ విభజన చట్టంలోని సెక్షన్ 46 ప్రకారం లోటు బడ్జెట్ కింద 15వేల 691కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. కనీసం దాని ప్రస్తావన కూడా బడ్జెట్లో లేదు. ఈ నేపథ్యంలో రాజధాని కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ తాజాగా చెప్పిన వాస్తవాలు చూస్తే.. ఏపీ ముందు ముందు ఎలాంటి కష్టాలుపడనుందో అర్థం అవుతుంది. రాజధాని ఆశలు ఎలా కల్లలు అవుతాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. ఇంతకీ శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన వాస్తవమేమిటంటే.. ఏపీ రాజధాని కోసం లక్షన్నర కోట్ల రూపాయలు అవసరమని ఏపీ సర్కారే అంచనా వేసింది. కానీ.. ఇలాంటి విషయాల్లో కేంద్రం పాత్ర పరిమితమే. ఇందుకు ఛత్తీస్ గడ్, జార్ఖండ్ ఉదంతాలే ఉదాహరణ. ఈ రెండు రాష్ట్రాలకూ రాజధానుల నిర్మాణం కోసం.. 12, 13 పంచవర్ష ప్రణాళికల్లో కేంద్రం అందించిన సాయం ఎంతో తెలుసా..? ఛత్తీస్ గడ్ కు 778కోట్లు.. జార్ఖండ్ కు 200కోట్లు.. ఉత్తరాఖండ్ కు 438కోట్లు మాత్రమే. ఎక్కడ లక్షన్నర కోట్లు.. ఎక్కడ 800 కోట్లు.. చంద్రబాబు పలుకుబడి ఉపయోగించినా.. మహా ఐతే.. అందుకు 5 రెట్లు సాధించగలరేమో.. అంటే.. 4వేల కోట్లు.. మరి మిగిలిన లక్షా 46వేల కోట్లు ఎలా సమీకరిస్తారు..? అసలే నిధుల లేమితో బాధపడుతున్న ఏపీకు దారేది..? అలాంటి పరిస్థితుల్లో పుత్రజయ లాంటి నగరం నిర్మిస్తామని ప్రజలను మభ్యపెట్టడం భావ్యమేనా..? ఆలోచించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: