తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తొలిసారి సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఇఎస్ఎల్ నరసింహన్ చొరవతో వీరు సమావేశం కానుండడం ప్రాధాన్యత సంతరించుకున్నది. రాజ్‌భవన్ వేదికగా ఈ సమావేశం జరగనున్నది. ఈ భేటీలో ముఖ్యమంత్రులతోపాటు ఇరు రాష్ట్రాల శాసనసభాపతులు సిరికొండ మధుసూధనాచారి, డాక్టర్ కోడెల శివప్రసాద రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవిఆర్ కృష్ణారావు కూడా పాల్గొంటారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై సిఎంల భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల సిఎంలు భేటీ కానుండడం ఇదే మొదటిసారి కానున్నది. నిత్యం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ముఖ్య నేతల మధ్య వివిధ కీలకాంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన చట్టంలో రెండు రాష్ట్రాల మధ్య గతంలో విద్యుత్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కొనసాగుతాయి. విద్యుత్ పంపిణీలో వినియోగం ఆధారంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేశారు. తెలంగాణకు అధికంగా విద్యుత్ కేటాయించడంతో పీపీఎల రద్దుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తొలి వివాదానికి దారి తీసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల్లో మరమ్మతుల పేరుతో విద్యుత్ ఉత్పత్తి నిలిపి వేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కేంద్ర విద్యుత్ అథారిటీ, ఏపీ విద్యుత్ నియంత్రణ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఖరిని తప్పుబట్టాయి. ఇక రెండు రాష్ట్రాల్లో ఉన్నత విద్యాకోర్సుల్లో ఉమ్మడి అడ్మిషన్ల అంశం మరో ప్రధాన వివాదంగా మారింది. ప్రత్యేకించి ఎంసెట్ కౌన్సిలింగ్ విషయమై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఏకపక్షంగా కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించడం పట్ల తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంలో భారీగా అవినీతి జరిగినందున దాని స్థానంలో ‘ఫాస్ట్’ అమలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే బోధనా ఫీజు చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్గిమీద గుగ్గిలమైంది. దీనిపై ముఖ్యమంత్రుల నుంచి రాష్ట్ర మంత్రుల వరకూ ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది. కృష్ణా డెల్టాకు తాగునీరు సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు చైర్మన్‌కు ఫిర్యాదు చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఒకానొక దశలో కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు చైర్మన్ పాండ్యా ఏకపక్షంగా కృష్ణా డెల్టాకు తాగునీరు విడుదల చేయాలని ఆదేశించడం, తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్ర నిరసన వ్యక్తం జరిగాయి. ఎట్టకేలకు పాండ్యా నేరుగా వచ్చి రెండు రాష్ట్రాల సాగునీటి పారుదల శాఖ అధికారులతో చర్చించి కృష్ణాడెల్టాకు 10 టీఎంసీల నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. మరో ప్రధాన సమస్య రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన తీరుపై తెలంగాణ ప్రభుత్వోద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. కమల్‌నాథన్ కమిటీ రూపొందించిన కొన్ని నిబంధనలతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో పని చేసేందుకు అనుమతించడంతో వాటిని తొలగించాలని టీఎన్జీఓలు డిమాండ్ చేస్తున్నారు. సొంత రాష్ట్ర ఉద్యోగులు మాత్రమే తెలంగాణలో పని చేయాలన్న డిమాండ్ న్యాయమైందేనని కమల్‌నాథన్ కూడా అంగీకరించారు. అయితే ఇరు రాష్ట్రాలు సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేసుకోవచ్చునని సూచించారు. కానీ ప్రస్తుతం ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మేరకు సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టిస్తుందన్నది అనుమానమే. ఉద్యోగ నియామకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. ఇటీవల ఓ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం పలికిన సమయంలో ఇరు రాష్ట్రాల సిఎంల మధ్య చిరు నవ్వుల పువ్వులు విరబూశాయి. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్ ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి హాజరైన ఇద్దరు సిఎంలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, సర్దుకు పోవాలని సూచించారని సమాచారం. ఈనేపథ్యంలో ఆదివారం జరిగే సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: