బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి వరుణ్‌గాంధీ దూరమయ్యారు. కొత్త కార్యవర్గంలో ఆయనకు చోటు దక్కలేదు. అయన తల్లి మేనకాగాంధీ మోడీ ప్రభుత్వంలో ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకుల మిశ్రమంగా ఈ టీమ్‌ కనిపించినప్పటికీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌లకు ప్రధాన ప్రాతినిధ్యం కల్పించినట్లు కనిపిస్తోంది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడ్యూరప్ప పార్టీ ఉపాధ్యక్షుడు కాగా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకర్త రామ్‌ మాధవ్‌ ప్రధాన కార్యదర్శి అయ్యారు. వారం రోజుల క్రితమే పార్టీ అధ్యక్షుడిగా లాంఛనంగా నియమితుడైన అమిత్‌ షా గురువారం తన కొత్త టీమ్‌ను ప్రకటించారు. ఇందులో 11 మంది ఉపాధ్యక్షుడు ఎనిమిదిమంది ప్రధాన కార్యదర్శులు, 14 మంది కార్యదర్శులు ఉన్నారు. ఈ కొత్త బృందంలో 10 మంది పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నారు. ఇందులో ఐదుగురు కొత్తవారు. సుల్తాన్‌పూర్‌ ఎంపీ వరుణ్‌ ప్రధాన కార్యదర్శి పదవికి దూరం కాగా కొత్త ప్రధాన కార్యదర్శులుగా జె.పి.నద్దా, రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, మురళీధర్‌ రావు, రామ్‌లాల్‌లను నియమించారు. వరుణ్‌గాంధీ తల్లి మేనకాగాంధీ మోడీ కేబినెట్‌లో ఉన్నందునే వరుణ్‌గాంధీని తీసుకోలేదని పార్టీ వర్గాలు వివరించాయి. మరో నలుగురు కొత్త ప్రధాన కార్యదర్శులుగా ఇటీవలే ఆర్‌ఎస్‌ఎస్‌ నుండి పార్టీలోకి వచ్చిన రామ్‌ మాధవ్‌, బిజెపి మహిళా మోర్చా మాజీ చీఫ్‌ సరోజ్‌ పాండే, రాజస్థాన్‌ నుండి రాజ్యసభ ఎంపీ భూపేంద్ర యాదవ్‌, రామ్‌ శంకర్‌ కథేరియా ఉన్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి దూరపై సొంత కుంపటి పెట్టుకుని కలకలం సృష్టించడంతో పాటు తర్వాత ఎన్నికల సమయంలో తిరిగి బిజెపిలోకి వచ్చిన యడ్యూరప్పకు 11 మంది ఉపాధ్యక్షుల్లో స్థానం లభించింది.  కేంద్ర మాజీ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీకి కూడా ఉపాధ్యక్ష పదవి లభించింది ఇతర ఉపాధ్యక్షులుగా బండారు దత్తాత్రేయ, సత్యపాల్‌ మాలిక్‌ (ఈ ఇద్దరు లోక్‌సభ సభ్యులే), పురుషోత్తం రుపాలా, ప్రభాత్‌ ఝా (రాష్ట్రాల మాజీ అధ్యక్షులు), రఘువీర్‌ దాస్‌ (జార్ఖండ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి) ఎన్నికయ్యారు. ఈ పదవిని పొందిన 11 మందిలో రాజస్థాన్‌ మాజీ ఎంపీ కిరణ్‌ మహేశ్వరి, బిజెపి ప్రముఖుల్లో ఒకరు వినరు సహస్రబుద్ది, బీహార్‌ నుండి రేణు దేవి, లక్నో మేయర్‌ దినేష్‌ శర్మ ఉన్నారు. ఈ కొత్త కార్యవర్గంలో ఐదుగురు ఒబిసిలు, ఆరుగురు మహిళలు ఉన్నారు, ఎస్సీ, ఎస్టీల నుండి కూడా ఇందులో ప్రాతినిధ్యం ఉంది. ఈ కొత్త కార్యవర్గంలో 80 శాతం మంది 60 లోపు వయస్సువారే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: