ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 18వ తేదీన ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 నుండి సెప్టెంబర్‌ 12వ తేదీ వరకు సమావేశాలు జరుగనున్నాయి. మొత్తం 25 రోజుల్లో ఏడు రోజులు సెలవులు కాగా 18 రోజుల పాటు బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 29న వినాయక చవితి, ఆ తర్వాత శని, ఆదివారాలు రావడంతో ఆ మూడు రోజులు విరామం ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శాసనసభ సమావేశం తొలి రోజున జరిగే బీఏసీ సమావేశంలో వీటన్నింటిపై తుది నిర్ణయం తీసుకుంటారు. అదే రోజు సాయంత్రం టీడీపీ శాసన సభా పక్ష సమావేశం జరపాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సాధారణ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.అదే రోజు శాసనసభలో, విధాన మండలిలో ప్రవేశపెట్టనున్నారు. అయితే మండలిలో మంత్రి నారాయణ ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్‌పై ఆరు రోజుల పాటు చర్చ ఉండే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. సమావేశాలపై పలువురు మంత్రులకు బాధ్యతలు కాగా శాసనసభ సమావేశాలు సాగే తీరు తెన్నులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. గురువారం నాడు క్యాంపు కార్యాలయంలో ఈ విషయంపై సీఎం ప్రత్యేకంగా సమీక్ష చేశారు. సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం సిద్దం చేసుకునే విధంగా ప్లానింగ్‌ ఉండాలని ఆయన మంత్రులకు హితవు చెప్పారు. రాష్ట్ర మంత్రులు పత్తిపాటు పుల్లారావు, పీతల సుజాత, కామినేని శ్రీనివాస్‌, చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు, విప్‌లు చింతమనేని ప్రభాకర్‌, పయ్యావుల కేశవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు పలు అంశాలపై మంత్రులకు దిశా నిర్ధేశనం చేశారు. ఇన్నాళ్లూ ప్రతిపక్షంలో ఉన్నామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చామని చంద్రబాబు నాయుడు మంత్రులకు కర్తవ్య బోధ చేశారంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ప్రశ్నలు సిద్దం చేసుకున్నట్లే ఇప్పుడు వారు చేసుకుంటారు.. మనం వారి కోసమే కాదు.. ప్రజల కోసం కూడా బాధ్యత వహించాలి అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారని సమాచారం. మరో వైపు సభ లోపల సమన్వయం కోసం ఐదుగురు మంత్రులకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాస రావు, రావెల కిషోర్‌ బాబులకు ఈ వ్యవహారాలను చూడాల్సిందిగా బాద్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. సభ వెలుపల సమన్వయ బాధ్యతలను పార్టీ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, పయ్యావుల కేశవ్‌, వేం నరేందర్‌రెడ్డిలకు అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: