ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కు సొరచేపలు ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టాయో చూడండి. ప్రపంచంతో ఇంటర్నెట్ అనుసంధానం కోసం సముద్రం అడుగుభాగాన అమర్చిన కేబుల్ వైర్లను ఈ ప్రమాదకర చేపలు కొరికివేస్తున్నాయట. దీంతో, ఆ డేంజరస్ జీవుల బారి నుంచి తన కేబుళ్ళను రక్షించుకునేందుకు గూగుల్ ఓ సరికొత్త కవచాన్ని రూపొందించింది. కేబుల్ వైర్ల చుట్టూ ఈ నూతన తొడుగును అమర్చుతారు. ఈ కవచం కెవ్లార్ వంటిదేనని, అత్యంత కఠినమైనదని గూగుల్ వర్గాలు చెబుతున్నాయి. కెవ్లార్ తో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తయారుచేస్తారన్న విషయం తెలిసిందే.  కాగా, షార్క్ లు కేబుళ్ళను కొరుకుతాయన్న విషయం 80వ దశకంలో వెలుగులోకి వచ్చింది. 1987లో అమెరికా నుంచి ఐరోపా, జపాన్ లతో సమాచార సంబంధాల కోసం ఏర్పాటు చేసిన ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ళను ఈ సొరచేపలు కొరకడంతో ప్రపంచవ్యాప్తంగా ఫోన్లు, కంప్యూటర్ లు మొరాయించాయట. 1985లో, కానరీ దీవి వద్ద సముద్రంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన కేబుళ్ళను పరిశీలించి చూడగా వాటిలో సొరచేప దంతాలు చిక్కుకుపోయినట్టు తెలిసింది. కాగా, ఈ చేపలు ఫైబర్ కేబుళ్ళ చుట్టూ ఏర్పడే విద్యుదయస్కాంత క్షేత్రానికి ఆకర్షితమవుతున్నందునే వైర్లను కొరుకుతున్నాయని ఓ సిద్ధాంతం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: