రాష్ట్ర విభజన తర్వాత తెలం గాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రోజుకో కీలక నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న 16 ముఖ్య కులాలను వెనుకబడిన తరగతుల(బీసీ) జాబితా నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. శనివారం బాగా పొద్దుపోయిన తర్వాత ఈ ఉత్తర్వులను వెలువరించి నట్లు ప్రచారం జరుగుతోంది. తొలగించిన బీసీ కులాల జాబితా ను ఆదివారం ఇంజినీరింగ్‌ ప్రవేశాలను పర్యవేక్షించే అధికారు లకు అందజేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డ్డాక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలను మాత్రమే జాబితాలో కొనసా గించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న ఏపీలోని ప్రధాన కులాలకు ప్రభుత్వం అందించే పథకాలు, రాయితీలు అమలు చేయకుండా నిరోధించడానికే ఈ కులాలను బీసీ జాబితానుండి తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో వెనుకబడిన తరగతుల్లో ప్రధాన కులాలయిన శెట్టి బలిజ(గౌడ), గవర, కొప్పుల వెలమ, కాళింగ, తూర్పు కాపుతోపాటు మరికొన్ని కులాలను బీసీ జాబితాలోనుండి తొలగించాలని నిర్ణయిం చింది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ సంక్షేమ శాఖ ఉత్త ర్వులు జారీచేసినట్లు సమాచారం. అధికారికంగా ఈ ఉత్తర్వులను ప్రభుత్వ వెబ్‌సైట్లో పొందుపరచలేదు. అయితే ఆదివారం నుంచి ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి వెబ్‌ ఆప్షన్లను ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతున్నందున ఆదివారం తెల్లవారుఝామున ఈ ప్రధాన కులాలను బీసీ జాబితానుండి తొలగించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ప్రధాన కులాలను బీసీ జాబితానుంచి తొలగించడంతో తెలంగాణ ప్రాంతంలో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు వెబ్‌ ఆప్షన్లను ఇచ్చే విద్యార్ధులు లబోదిబోమంటున్నారు. బీసీ జాబితాలో ఉన్న కులాలను తొలగించడంతో ఈ ప్రధాన కులాలకు చెందినవారంతా ఓసీ జాబితా కిందకి వచ్చారు. నిన్నటిదాకా బీసీ జాబితాలో ఉన్న తమను తెలంగాణ ప్రభుత్వం తొలగించిందని, దీంతో తాము ఓసీలమయ్యామని మంచి ర్యాంకులు సాధించినా బీసీ కేటగిరీలో తమకు ఇంజినీరింగ్‌ సీట్లు లభ్యమయ్యే అవకాశం లేదని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో గవర, కొప్పుల వెలమ, కాళింగ, తూర్పు కాపు, శెట్టి బలిజవంటి కులాలు లేవని, ఒకవేళ ఉన్నా వారంతా స్థానికేతరులేనని, అటువంటివారికి బీసీ కేటగిరీలో సీట్లు ఎలా ఇస్తామని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అన్ని కులాలను బీసీ జాబితాలో చేరిస్తే ఫాస్ట్‌ పథకం తడిసి మోపెడవుతుందని, తెలంగాణతరులకు ఈ పథకం కింద ఫీజులు ఎలా చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే బోధనా ఫీజుల వ్యవహారం చినికిచినికి గాలివానగా మారడం, తాజాగా కొన్ని కులాలను బీసీ జాబితానుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఈ వివాదం పెద్దఎత్తున చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను, ఇబ్బందులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖర్‌రావులు గవర్నర్‌ సమక్షంలోనే ప్రకటించినా అందుకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కులాలను బీసీ జాబితా నుండి తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందినవారి కులాలను అక్కడి బీసీ జాబితా నుండి తొలగించే అవకాశాలు లేకపోలేదని అధికారులు భావిస్తున్నారు. సీమాంధ్రలో ముదిరాజ్‌, అరెకటికవంటి కులాలు లేవని దీనిని సాకుగా తీసుకుని అక్కడి తెలుగుదేశం ప్రభుత్వం ఈ కులాలను బీసీ జాబితా నుండి తొలగిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై అధికారులు వాకబు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇటువంటి చర్యలకు పాల్పడరని, మరిన్ని కులాలను బీసీ జాబితాలో చేర్చేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్న ఈ తరుణంలో కులాల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టరని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సీమాంధ్రలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారని వారంటున్నారు. కాపులను బీసీలో చేర్చేందుకు సంబంధించి ప్రత్యేక బీసీ కమిషన్‌ను కూడా ఏర్పాటుచేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారని గుర్తుచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుండి తొలగించిన కులాలను కేవలం ఒక ఇంజినీరింగ్‌ ప్రవేశాలకే కాకుండా భవిష్యత్తులో జరిగే ఎడ్‌సెట్‌, లాసెట్‌, పాలిటెక్నిక్‌, ఈసెట్‌, పిజి ఇంజినీరింగ్‌ వంటి కోర్సులకు కూడా వర్తింపచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.  అధికారుల లెక్కల ప్రకారం హైదరాబాద్‌తోపాటు పొరుగున ఉన్న రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలనుంచి వచ్చి స్థిరపడిన బీసీ కులాలు పెద్దసంఖ్యలో ఉన్నాయని, ఇందులో ప్రభుత్వం తొలగించిన శెట్టి బలిజ, గవర, కాళింగ, కొప్పుల వెలమ సామాజిక వర్గాలకు చెందినవారు ఎంతోమంది ఉద్యోగులు, దినసరి కూలీలు, వ్యాపారులు, కూలీనాలీ చేసుకుని జీవనం సాగించేవారు ఉన్నారని అంటున్నారు. హైదరాబాద్‌లో భవన నిర్మాణానికి సంబంధించి సెంట్రింగ్‌ పని చేసే కార్మికుల్లో 75శాతం మంది ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినవారేనని, వీరిలో కాళింగ, గవర సామాజిక వర్గాలకు చెందినవారు పెద్దసంఖ్యలో ఉన్నారని అధికారుల లెక్కలను బట్టి తెలుస్తోంది. ఇంజినీరింగ్‌లో వెబ్‌ఆప్షన్లు ఇచ్చేందుకు ఆదివారం కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన ఒక విద్యార్ధి మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌కు వచ్చారని, తీరా తన కుల ధృవపత్రాన్ని పరిశీలింపచేయడానికి అక్కడే ఉన్న అధికారుల వద్దకు వెళ్ళగా ఈ కులం బీసీ జాబితా నుండి తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పడంతో ఆ విద్యార్ధి ఒక్కసారిగా డీలాపడ్డారు. అక్కడే ఉన్న ప్రవేశాల క్యాంపు అధికారి డాక్టర్‌ రఘునాధ్‌ను ఈ అంశంపై ఆరా తీయగా ఈ తెల్లవారుజామునే కొన్ని ప్రధాన కులాలను బీసీ జాబితా నుండి తొలగిస్తూ ప్రభుత్వం తమకు సమాచారమందించిందని ఈ విషయంలో చేసేదేమీ లేదని చెప్పారు. తొలగించిన ఈ కులాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీసీ జాబితాలోనే కొనసాగుతుండగా తెలంగాణ సర్కార్‌ మాత్రం ఈ కులాలను తమ జాబితా నుంచి తొలగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: