తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తికుడు. దేవున్ని బాగా నమ్ముతారు. పూజలు, వ్రతాలు బాగానే చేస్తారు. ఏదైనా పెద్ద కార్యాలు తలపెట్టినప్పుడు యాగాలు, హోమాలు కూడా చేస్తారు. ఆయనకు వ్యక్తిగత ఆధ్యాత్మిక సలహాదారు కూడా ఉన్నారు. అంతే కాదు.. వాస్తుపైనా చంద్రశేఖరుడికి పట్టింపు ఎక్కువ. ముహూర్తాలపైనా గురి ఉంది. అందుకేనేమో ఆదివారం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ఆయన చంద్రబాబుకు ఓ సలహా కూడా ఇచ్చారు. సమావేశంలో చంద్రబాబు తమ రాజధాని విషయం ప్రస్తావించారు. దీనిపై కేసీఆర్ కూడా స్పందించారు. రాజధాని విషయంలో కేంద్రం నుంచి అందాల్సినంత సాయంరాదేమోనని కేసీఆర్ సందేహం వెలిబుచ్చారు. ఈ విషయంలో తాము కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో కేసీఆర్ చంద్రబాబుకు రాజధాని విషయంలో సలహా ఇచ్చారు. ఉత్తరాన నది ఉన్ననగరాలు వాస్తుపరంగా బాగా ఉంటాయని.. బాగా అభివృద్ధి చెందుతాయని చంద్రబాబుకు చెప్పారు. ఏపీలో ఉత్తరాన నది ఉన్న పట్టణాలు మంగళగిరి, అమరావతి.. కాబట్టి ఈ రెండు పట్టణాలు కలిసేలా రాజధాని ఉంటే.. త్వరగా అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ చంద్రబాబుతో అన్నారట. మొదట్లో చంద్రబాబు ఈ నమ్మకాలను అంతగా పట్టించుకోకపోయినా.. ఆయనా ఇప్పుడు మారారు. వరుసగా పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న ప్రభావమో ఏమో గానీ.. ఇటీవల చంద్రబాబు కూడా ప్రతివిషయానికి ముహూర్తాలు చూసుకుంటున్నారు. మరి అలా మారిన బాబు కేసీఆర్ మాట వింటారా.. ఎలాగూ ఇప్పటికే రాజధాని బెజవాడ-గుంటూరు ప్రాంతంలోనే అనుకుంటున్నారు కాబట్టి.. కేసీఆర్ సలహా పాటించే అవకాశమే ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: