తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు దక్షిణ తెలంగాణ జిల్లా అయిన మహబూబ్-నగర్-కు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. త్వరలో జరగనున్న విస్తరణలో ఈసారి పాలమూరు నుంచి ఒకరికి తప్పకుండా ఛాన్స్ దక్కొచ్చన్న ప్రచారం గతంలో బాగా జరిగింది. కానీ, ఇప్పుడా ప్రతిపాదన వెనక్కు పోయినట్లే కన్పిస్తోంది. ప్రస్తుతం అంతా పాలనాపరమైన వ్యవహారాల్లో తలమునకలు కావడంతో కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చన్న వాదన విన్పిస్తోంది. ఇక, తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకున్న మెట్రో ప్రాజెక్టులో కొన్ని మార్పులు చేర్పులు తప్పకపోవచ్చన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల నుంచే విన్పిస్తోంది.  ఇక, ఆ మధ్య హడావుడి చేసిన అక్రమ కట్టడాల కూల్చివేతల వ్యవహారం ముందు ముందు కూడా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పలు అంశాలు పరిశీలిస్తున్నట్లు కన్పిస్తోంది. డబ్బులన్నీ ఒకేసారి కట్టాలని ప్రభుత్వాన్ని ఆర్బీఐ కోరినట్లు సమాచారం. అయితే, ఒకేసారి మొత్తం డబ్బులు కట్టడమంటే ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమన్నది టీఎస్ ప్రభుత్వ భావన. దీంతో అవసరమైతే రైతులకు బాండ్లు ఇచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: