న్యాయ వ్యవస్థలో ఓ చారిత్రక అంకం మొగ్గ తొడిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రంగంలోనూ గోప్యతకు తావుండకూడదన్న విశ్వజనీన నియమానికి భారత పార్లమెంట్ పట్టం కట్టింది. ఈ నిర్ణయాత్మక చర్య ద్వారా న్యాయ నియామకాల్లో ప్రభుత్వ పాత్రకూ సముచిత స్థానం లభించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో న్యాయ వ్యవస్థలో పారదర్శక నియామకాలకు మార్గం సుగమమైంది. ఉన్నత న్యాయ స్థానాలకు న్యాయమూర్తులను నియమించేందుకు కొత్త వ్యవస్థను పాదుగొల్పడం, అలాగే కొలీజియం వ్యవస్థకు చరమగీతం పాడేందుకు ఉద్దేశించిన ఈ బిల్లులకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. కేవలం రెండు రోజుల వ్యవథిలో న్యాయ నియామకాల కమిషన్ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలూ ఏకగ్రీవంగా ఆమోదించడం న్యాయమూర్తుల నియామకాల్లో పారదర్శకతను పెంపొందించాలన్న అవసరాన్ని, ప్రాధాన్యతను చాటిచెప్పేదే. నిజానికి కొలీజియం వ్యవస్థలో మార్పులు తేవాలన్న ఆలోచన ఈనాటిది కాదు. నరేంద్ర మోదీ సర్కార్ ఇప్పటికిప్పుడే తెరపైకి తెచ్చింది అంతకంటే కాదు. న్యాయ నియామకాల్లో కార్యనిర్వాహక వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించాలన్న డిమాండ్ దీర్ఘకాలంగా వినిపిస్తున్నదే. అయితే ఇందుకు సంబంధించి గతంలో చేపట్టిన శాసనపరమైన ప్రయత్నాలకు ఏదో విధంగా అవరోధం ఏర్పడుతూనే వచ్చింది. ఇన్నాళ్లకు కొలీజియం స్థానే న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటుకు ఆస్కారం ఏర్పడింది. లోక్‌సభలో బిజెపి సారథ్యంలోని ఎన్డీయే సర్కార్‌కు ఉన్న సంపూర్ణ మెజార్టీ ఇందుకు కారణం అయితే..కాంగ్రెస్ మెజార్టీలో ఉన్న రాజ్యసభలోనూ ఈ బిల్లుకు ఆమోదం లభించడం న్యాయ సంస్కరణలకు అన్ని పార్టీల మద్దతు ఉందన్న వాస్తవాన్ని చాటిచెప్పేదే. న్యాయమూర్తుల ఎంపిక, నియామకం, బదిలీలకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా 1993లో దేశ అత్యున్నత న్యాయస్థానం కొలీజియం వ్యవస్థను తీసుకొచ్చింది. ఇనే్నళ్లుగా న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఏరకమైన ఆరోపణలూ లేకపోయినా ఇటీవల వెలుగు చూసిన కొన్ని అవాంఛనీయ అంశాలు ఈ వ్యవస్థ పారదర్శకత పట్ల సందేహాలకు ఆస్కారం ఇచ్చాయి. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న దినకరన్ అనే న్యాయమూర్తిని సుప్రీం కోర్టుకు బదిలీ చేయడం అలాగే సౌమిత్ర సేన్ ఉదంతాలు కొలీజియం వ్యవస్థను సంస్కరించాల్సిన అగత్యాన్ని చాటిచెప్పాయి. ఈ వ్యవస్థలో అంతర్గతంగా ఉన్న లోపాలను తొలగించడంతో పాటు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి ఎలాంటి సంశయాలకు తావులేని రీతిలో దిద్దుబాటు చర్యల అవసరం కూడా ప్రస్ఫుటంగానే కనిపించింది. గత రెండు దశాబ్దాలుగా కొలీజియం పనితీరును లోతుగా విశే్లషిస్తే దీన్ని సంస్కరించాల్సిన పరిణామాలెన్నో కళ్లకు కడతాయి. ఇది పూర్తిగా బయటి ప్రపంచానికి ఇసుమంతైనా తెలియని రహస్య వ్యవస్థ. అలాంటప్పుడు సహజంగానే ఆశ్రీత పక్షపాతాలకు, ఇతర అనుమానాస్పద నిర్ణయాలకు ఆస్కారం ఏర్పడుతుంది. న్యాయమూర్తులే తమను తాము నియమించుకోవడానికి, పదోన్నతులు కల్పించుకోవడానికి దోహదం చేసే ఈ వ్యవస్థను తీర్చిదిద్దాలన్న అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టినా తాజా ఉదంతాలు వెలుగు చూసే వరకూ ఆ ప్రయత్నం ముందుకెళ్లలేదు. ప్రపంచంలో ఉన్నత విలువలకు పట్టం కట్టే ప్రజాస్వామ్య వ్యవస్థగా కీర్తినందుకుంటున్న భారత దేశంలో ఇలాంటి రహస్య వ్యవస్థలకు ఆస్కారం ఉండకూడదు. ఎంతగా పారదర్శకత ప్రస్ఫుటిస్తే అంతగా ఏ వ్యవస్థ అయినా రాణిస్తుంది. అందరి మన్ననలూ అందుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా న్యాయ నియామకాలన్నవి పూర్తిగా న్యాయ వ్యవస్థ చేతుల్లోనే ఉన్న దాఖలాలు లేవు. దాదాపు అన్ని దేశాల్లోనూ న్యాయమూర్తుల నియామకాల్లో ప్రభుత్వ ప్రమేయానికీ ఆస్కారం ఉంది. అమెరికా విషయానే్న తీసుకుంటే అక్కడ న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వానికి అత్యంత క్రియాశీలక పాత్రే ఉంది. ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డం సహా అనేక దేశాల్లోనూ ఇదే గుణాత్మక పరిస్థితి కొనసాగుతోంది. అలాంటిది దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 సంవత్సరాలు పూర్తవుతున్నా న్యాయ నియామకాలన్నవి రహస్యంగా జరగడానికి, అందులో కార్యనిర్వాహక వర్గానికి ఎలాంటి పాత్ర లేకుండా పోవడానికి ఎలాంటి ఆస్కారం ఉండకూదు. ఇలాంటి వ్యవహారాల్లో అన్ని దేశాల్లో ఒకే రకమైన విధానం అమలులో లేకపోయినా..ప్రాథమికంగా మాత్రం ఆయా ప్రభుత్వాలకు గణనీయమైన పాత్ర ఉంటుందన్నది స్పష్టం. ఇతర దేశాలకు అన్ని విధాలా భారత్ కూడా ఆదర్శంగా ఉండాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవడం ఎంతైనా సముచితమే. ప్రస్తుతం పార్లమెంట్ ఆమోదించిన బిల్లు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన గొప్యతను తొలగించేదే. నియామక వ్యవహారాల్లో ఎక్కడా పొరపాట్లకు, ఇతర అనుచితాలకు తావు లేకుండా జ్యుడీషియల్ కమిషన్ నిర్మాణాత్మక బాధ్యలు నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా న్యాయ, న్యా యేతర రంగాలకు చెందిన నిపుణులకు ఇందులో సమాన ప్రాతినిధ్యం క ల్పించడం అన్నది ఏకాభిప్రాయ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవడానికి కొలమానం అవుతుంది. అంటే సంస్థాగతమైన పరిశీలనలు, తనిఖీలు ఉం డటం అన్నది ఏ వ్యవస్థ అయినా సక్రమంగా, రుజువర్తనతో పని చేయడానికి దోహదం చేస్తాయి. రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత పదునెక్కడానికి, ఆదర్శనీయంగా పని చేయడానికి ఇలాంటి తనిఖీలు, సమతూక ప్రాధాన్యతలను ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. ఇలాంటి వ్యవస్థ ఉండటం అన్నది రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు అర్థవంతంగా, సమర్థంగా పని చేయడానికి విశేషంగానే దోహదం చేస్తాయి. ఏ వ్యవస్థా మితిమీరిన అధికారాలను పొందకుండా, అలాగని మరో అధికారిక వ్యవస్థకు లొంగకుండా స్వతంత్య్రంగా పని చేయగలిగే ఏర్పాటు మన రాజ్యాంగంలో ఉన్నాయి. ఇటు ప్రభుత్వమైనా, అటు న్యాయ వ్యవస్థ అయినా సరే ఇదే రాజ్యాంగ చట్రంలో పని చేయాల్సిందే. అయితే కొలీజియం వ్యవస్థ రద్దుకావడం వల్ల న్యాయ వ్యవస్థ స్వేచ్ఛాయుత పనితీరుకు విఘాతం కలుగుతుందన్న వాదన అంత సమంజసంగా కనిపించడం లేదు. ఏ మార్పయినా మరింత మెరుగైన సేవలు అందించడానికి దోహదం చేస్తే అందుకు అందరూ అంగీకరించాల్సిదే. గతంలో కొలీజియం వ్యవస్థ అమల్లోకి రావడానికి ప్రధాన కారణం కార్యనిర్వాహక వర్గానికి మొగ్గు చూపే ధోరణులకు స్వస్తిచెప్పాలన్న ఆలోచనే. కానీ ఇనే్నళ్ల కొలీజియం పని తీరు ఇందుకు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉందనడానికి దృష్టాంతాలెన్నో..! ఈ రకమైన పరిస్థితిని తొలగించడం ద్వారా సమతూకానికి పట్టం కట్టాలన్న లక్ష్యం పార్లమెంట్ ఆమోదం పొందిన న్యాయ నియామకాల కమిషన్ బిల్లులో కనిపిస్తోంది. న్యాయ వ్యవస్థ పనితీరులో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని కేంద్రం పదేపదే చెప్పడం కూడా జ్యుడీషియరీ అన్నది మరింత పరిపూర్ణంగా పని చేసేందుకు దోహదం చేసేదే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: