సర్వే.. సర్వే.. సర్వే... ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్.. ఆగస్టు 19నాటి సర్వే గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఎన్నో సందేహాలు, అనుమానాలు, అపోహలు ఈ సర్వే చుట్టూ తిరుగుతున్నాయి. దేశంలోనే మొదటి సారిగా ఓ రాష్ట్రమంతటా ఒకే సారి ఒకే సయమంలో ఈ సర్వే జరగబోవడం విశేషం. ఒక సర్వే కోసం ప్రభుత్వం సెలవు దినం ప్రకటించడం కూడా ఇదే మొదటిసారి. అంతేకాదు... సర్వే కోసం ఆ రోజు రాష్ట్రంలోని మొత్తం వాహనాలను వినియోగించడం.. అన్ని కార్యాలయాలను, సినిమాహాళ్లను, హోటళ్లను మూసేయడం కూడా ఇదే తొలిసారి. ఎందుకీ సర్వే...? గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు..? చాలా మంది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇది. ఇందుకు ప్రభుత్వం వద్ద చక్కటి సమాధానం ఉంది. ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా.. కొత్త పథకాలు రూపొందించాలన్నా.. రాష్ట్ర సంక్షేమం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా సరైన సమాచారం అవసరం. ప్రజల గురించిన సరైన డాటా లేకుండా రూపొందించిన పథకాలు అమల్లో విఫలమవడమే కాదు.. ప్రజాధనం దుర్వినియోగం కావడానికి కారణమవుతాయి. అందుకే సమగ్ర సమాచారం సేకరించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా ఇకపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటి వరకూ సమాచారం లేదా..? కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 2 నెలలే అయ్యింది. మరి ఇప్పటివరకూ రాష్ట్రప్రభుత్వం వద్ద సంక్షేమ పథకాల కోసం సమాచారమే లేదా..? సమాచారం లేకుండానే గత ప్రభుత్వాలు సంక్షేమపథకాలను రూపొందించాయా..? ఈ సందేహం రావడం చాలా సహజం. ఐతే.. ప్రభుత్వం వద్ద ప్రస్తుతం ఉన్న సమాచారం చాలా లోపభూయిష్టంగా ఉందన్నది కేసీఆర్ సర్కారు వినిపిస్తున్న వాదన. అందుకు కేసీఆర్ సర్కారు చూపుతున్న ఉదాహణలే అద్దంపడతాయి. రాష్ట్రంలో షుమారు 80లక్షల వరకూ కుటుంబాలుంటే.. కోటికిపైగా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమైంది. సరైన పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా... అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో ఇష్టం వచ్చినట్టుగా కార్డులు జారీ చేయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. వీటి ఆధారంగా జారీ అయ్యే సబ్సిడీ నిత్యావసరాలు కారణంగా ప్రభుత్వం పై భారం విపరీతంగా పెరగడమే కాకుండా.. అవన్నీ నల్ల బజారుకు తరలిపోతున్నాయి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. సర్వేపై అపోహలు.. తెలంగాణ ప్రాంత అభివృద్ధి, ఆత్మగౌరవం పేరుతో ఉద్యమించి రాష్ట్రం సాధించిన వెంటనే.. కేసీఆర్ ఈ సర్వేకు పూనుకోవడం వల్ల.. ప్రజల్లో ముఖ్యంగా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరపడిన, వలస వచ్చిన సీమాంధ్రుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. తమను బలవంతంగా ఖాళీ చేయించేందుకు, తమను గుర్తించేందుకు, తమకు అందుతున్న ప్రభుత్వ పథకాల్లో కోత వేసేందుకే ఈ సర్వే చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ సర్వేకు వ్యతిరేకంగా హైకోర్టులోనూ పిటీషన్లు దాఖలయ్యాయి. ఐతే అవి కేవలం అనుమనాలు మాత్రమేనని సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే కొట్టిపారేశారు. ఆంధ్రులను గుర్తించే లక్ష్యంతోనే కాదు.. ఎవరినీ ప్రత్యేకించి ఉద్దేశించి ఈ సర్వే చేయడం లేదని మీడియా ముందు ప్రకటించారు. హైకోర్టు కూడా సర్వేను అడ్డుకోవడానికి నిరాకరించింది. సర్వే చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కాకపోతే ప్రజలు తమ ఇష్టం మేరకే సమాచారం ఇవ్వొచ్చని.. బలవంతం ఏమీ లేదని తెలిపింది. సమగ్ర సమాచారమే లక్ష్యం.. రేషన్ కార్డుల ఉదంతమే కాదు. ఫీజు రీఎంబర్స్ మెంటు, ఇందిరమ్మ ఇళ్లు, వృధ్దాప్యఫించన్లు.. ఇలా అన్ని ప్రభుత్వ పథకాల్లోనూ అవినీతి మేట వేసింది. వీటిని జారీ చేయడంలో ఇప్పటివరకూ జరిగిన అవకతవకలుక స్వస్తి పలికి...నిజమైన లబ్దిదారులకు ప్రభుత్వ ఫలాలు అందించడమే ఈ సమగ్ర సర్వే ఉద్దేశ్యం. గతంలో ఒక్కో పథకం కోసం ఆ పథకానికి అనుగుణంగా సమాచారం సేకరించేవారు. అందువల్ల తప్పుడు సమాచారం ఇవ్వడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు.. అన్ని పథకాలకు అవసరమైన సమాచారం ఒకేసారి తీసుకోవడం వల్ల.. తప్పుడు సమాచారానికి ఆస్కారం ఉండదు. అందులోనూ గతంలో ఎలాంటి ఆధారాలు పెద్దగా పరిశీలించకుండానే పత్రాలు జారీ చేశారు. ఈ సర్వేలో అలా కాకుండా నిర్దిష్టమైన పత్రాలు చూపాల్సి ఉంటుంది. గతంలో మనిషి ఎక్కడో ఉన్నా..వారి పేరుతో పథకాల కోసం దరఖాస్తుపత్రాలు నింపేసేవారు.. అందువల్ల.. ఒక్కొక్కరికి రెండు మూడు చోట్ల ఫలాలు అందేవి. వాటిలో ఎక్కువ భాగం దుర్వినియోగం అయ్యేవి. సమగ్ర సర్వేతో ఆ అవకాశం ఉండదు. సర్వే కోసం ప్రజలు ఏం చేయాలి..? సర్వే మంచిదే.. సరే మేం ఏంచేయాలి అన్న సందేహం సహజమే. అందుకు ప్రజలు చేయాల్సింది పెద్దగా ఏంలేదు. ఆగస్టు 19న కచ్చితంగా కుటుంబసభ్యులతో సహా ఇంట్లో ఉండాలి. ఎన్యుమరేటర్లు అడిగే సమాచారం ఇవ్వాలి. ఇచ్చే సమాచారానికి తగిన రుజువులు చూపించాలి. ప్రజల అనుమానాలు తొలగించేందుకు ప్రభుత్వం ఏ ఏ పత్రాలు అవసరమవుతాయో కూడా ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం ఒరిజినల్ పత్రాలు దగ్గర పెట్టుకుంటే చాలు. సర్వేకు ముందు రోజు సంబంధిత ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చి పరిశీలించి.. ఓ స్టిక్కర్ ఇంటికి వేసి వెళ్తారు. ఆ స్టిక్కర్ అతికించారంటే.. మరుసటి రోజు మీ ఇంటికి సర్వేకు వస్తారన్న మాట. ఒకవేళ ఏ కారణం చేతనైనా.. మీ ఇంటికి స్టిక్కర్ అతికించకపోతే.. మీ ఇంటికి ఎవరూ రాకపోతే..మీరు 40-21111111 నెంబర్ కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. సర్వేలో ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి.? సర్వేలో నివశిస్తున్న ప్రదేశం, ఇంటి నల్లా ఉందా లేదా..? మతం, సామాజికవర్గం, కులం, గ్యాస్ ఉందా లేదా..? కుటుంబంలో ఎంత మంది ఉన్నారు?, వారి వివరాలు?, ఇల్లు ఎలాంటిది..? ఇళ్ల స్థలాలు ఉన్నాయా..? ప్రభుత్వ పథకం నుంచి ఇంటి కోసం లబ్ది పొందారా..? విద్యుత్ సదుపాయం, విద్యుత్ బిల్లు వివరాలు.. వికలాంగులు ఉంటే వారి వివరాలు.. అనాథలు ఉంటే వారి వివరాలు.. ఉద్యోగా?, నిరుద్యోగా?, ఉద్యోగి అయితే ఏరకం ఉద్యోగం.. చరాస్తుల వివరాలు.. సైకిల్, మోటార్ సైకిల్ ఉందా..? లేదా..? త్రి చక్రవాహనం ఉందా ?లేదా.. ?కారు, జీపు, జేసీబీ, నాలుగు అంతకన్నా ఎక్కువ చక్రాలున్నా వాహనాలు ఉన్నాయా..? వ్యవసాయ యంత్రాలు ఉన్నాయా..? ఏసీ ఉందా..? వ్యవసాయ భూమి ఉందా..? ఉంటే దాని వివరాలు.. కుటుంబ పశు సంపద వివరాలు.. ఇవీ ప్రధానంగా అడిగే ప్రశ్నలు. ఏ ఏ పత్రాలు సిద్ధం చేసుకోవాలి..? అధికారులకు చూపించేందుకు దాదాపు 9 ధ్రువీకరణపత్రాలు ప్రజలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అవి.. 1. జలమండలి జారీ చేసిన మంచినీటి కుళాయి బిల్లు, 2. ఆస్తిపన్ను అసెస్ మెంట్ పత్రం, 3. వంటగ్యాస్ బిల్లు, 4. విద్యుత్ బిల్లు, 5. కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, 6.కుల ధ్రువీకరణ పత్రం, 7.జనన ధ్రువీకరణ పత్రం, 8.వికలాంగులైతే ధ్రువీకరణ పత్రం, 9. పట్టాదారు పాస్ పుస్తకం. ఐతే ఇవేవీ అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. చూపిస్తే సరిపోతుంది. అన్ని వివరాలు చెప్పాల్సిందేనా...? సర్వేపై ఎన్నో అపోహలు- అనుమానాలు ఉన్న నేపథ్యంలో.. ఎలాంటి సమాచారం ఇవ్వాలి.. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే ఏమవుతుంది. అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఎంత ఆదాయం వస్తుంది.. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా లేదా.. మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఎంత.. వంటి ప్రశ్నలకు ప్రజలు సమాధానం ఇవ్వాలా వద్దా అన్నది ప్రజల ఇష్టమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎవరినీ బలవంతం చేసి సమాచారం తీసుకోరని.. ఇష్టంలేని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోయినా ఫరవాలేదని చెబుతున్నారు. కాబట్టి సర్వే పట్ల అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు సర్వేను నెగిటివ్ కోణంలో ఆలోచించవద్దని ప్రభుత్వం సూచిస్తోంది. వలస పక్షలు సంగతేంటి..? చాలా కుటుంబాలు ఉపాధి కోసం నగరాలు, విదేశాలకు వలసపోతారు. మరి వారి సంగతేంటి. వారు కచ్చితంగా సర్వే రోజు స్వగ్రామంలో ఉండాల్సిందేనా.. ఈ ప్రశ్నలు కూడా చాలామందిలో ఉంటాయి. విదేశాల్లో ఉన్నవారు తప్పించి.. రాష్ట్రంలో ఉన్నవారు స్వస్థలంలోనే నమోదు చేయించుకోవాలంటే.. ఆ ఊరికి వెళ్లకతప్పదు. లేదా ప్రస్తుతం ఉంటున్న ప్రదేశంలో నమోదు చేసుకున్నా సరిపోతుంది. ప్రధానంగా హైదరాబాద్ లో ఉపాధి పొందుతున్నవారిలో ఎక్కడ నమోదు చేయించుకోవాలన్న సందేహం ఎక్కువ. తాము ఇక్కడే కొనసాగుతామనుకున్నవారు హైదరాబాద్ లోనే నమోదు చేసుకోవచ్చు. లేదు.. హైదరబాద్ లో ఎన్నాళ్లుంటాం.. మళ్లీ వెళ్లిపోతాం కదా.. అనుకున్నవారు స్వగ్రామంలో నమోదు చేయించుకోవచ్చు. అది ప్రజల ఇష్టానికే ప్రభుత్వం వదిలేసింది. కానీ రెండు చోట్ల నమోదు చేసుకోవడం మాత్రం కుదరదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నమోదు చేసుకోకపోతే ఏమౌతుంది..? ప్రభుత్వం ఎంతో వ్యయంతో.. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న ఈ సర్వేలో వివిధ కారణాలతో కొందరు నమోదు చేసుకోలేకపోవచ్చు.. వారి సంగతేంటన్నది మరో ప్రశ్న.. కానీ ప్రాణావసరాలు, ఆసుపత్రుల్లో వైద్యం వంటి రేర్ కేసుల్లో తప్ప..మిగిలిన అన్నిసందర్భాల్లోనూ నమోదు చేయించుకోవడమే మంచిది. ఇప్పుడు నమోదు కాకపోతే.. మళ్లీ నమోదు చేసుకోవడం చాలా కష్టతరమైన ప్రక్రియ అవుతుంది.కాబట్టి సాధ్యమైనంత వరకూ ఇప్పుడు నమోదు చేయించుకోవడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: