కోట్లలో జనం..! ఒకే ఒక్కరోజు..! ఉన్నది ఒకే ఒక్క అవకాశం..! స్థానిక సభ్యత్వం నుంచి ప్రభుత్వ పథకాల వర్తింపు వరకు...అన్నింటికీ ఈ సర్వే లెక్కలే ఆధారం..! ఈ ఛాన్స్ మిస్సయ్యిందటే.. ఇక జనాభా లెక్కల్లో లేనట్లే..! పోయిన అవకాశం మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియదు..! అందుకే బతుకు జీవుల గుండెల్లో గుబులు మొదలైంది..! ఎక్కడెక్కడి వారంత సొంతూర్ల ముఖం పట్టారు..! అయితే అటు సర్వేకు సర్వం సిద్ధం చేసిన తెలంగాణ సర్కార్, బతుకుదెరువు కోసం పట్నం వచ్చిన వలస జీవులు..., తమ ఊళ్లకు వెళ్లేందుకు.. అవసరమైన కనీస ఏర్పాట్లను మాత్రం మర్చిపోయింది.! ఇప్పుడు తెలంగాణలో ఒకటే జపం అదే సర్వే జపం..! సర్వం సర్వేమయం..! తెలంగాణ అంతటా ఇప్పుడు ఒకేటే మాట వినబడుతోంది. ఏ ఊరుకెళ్లిన.. వాడకెళ్లిన.. బస్తీకి వెళ్లిన, కాలనీకి వెళ్లిన, బస్టాండ్, రైల్వే స్టేషన్ ఎక్కడికి వెళ్లినా.. సమగ్రసర్వే గురించే చర్చ.. ఇదే హాట్ టాఫిక్ అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మా ఇంటికి వచ్చారు. స్టిక్కర్ కూడా పెట్టేశారు. మీ ఊరికి ఈ ఇవాళే వచ్చారు. కరపత్రాలు పంచారు. ఇక మంగళవారం మాత్రం తప్పకుండా ఇంట్లోనే ఉండాలంటా.. లేకపోతే మళ్లీ ఎంట్రీ చేసుకోరంటా..! ఎవర్ని కదిలించిన ఇవే విషయాలు చెబుతున్నారు. మొదట తెలంగాణ జిల్లాల్లో 84 లక్షల కుటుంబాలు ఉంటాయని అంచాన వేసినా.. ఆ సంఖ్య ఇప్పుడు కోటి దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సర్వేలో దాదాపు కోటికి పైగా కుటుంబాలు తమ వివరాలు నమోదు చేసుకుంటున్నాయని అంటున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని మండలాల్లో ప్రాథమిక పరిశీలను పూర్తి చేశారు. చాలా గ్రామాల్లో బస్తీల్లోనూ ఇండ్లకు స్టీక్కర్లు సైతం అతికించారు. కరపత్రాలు...సమగ్రసర్వే వివరాలతో కూడిన మెడల్ ఫారములను సైతం అందజేశారు. సర్వే రోజు కుటుంబాలు రెడీగా ఉంచుకోవాల్సిన అన్ని వివరాలను చెక్ లిస్ట్ ను సైతం అందరికి అందజేస్తున్నారు. కొన్ని చోట్లా ప్రభుత్వ సిబ్బందికి సాయంగా ఇంజినీరింగ్,డిగ్రి విద్యార్థుల సాయం తీసుకుంటున్నారు. ఒక్కో మండలాన్ని నాలుగు విభాగాలుగా చేసి విభాగానికో అధికారిని పర్యవేక్షణకు నియమించారు. ఉద్యోగులకు రవాణ వసతి కల్పించారు. ఒక్కో ఉద్యోగికి 30 నుంచి ౪5 కుటుంబాల సర్వే బాధ్యత అప్పగించారు. కొన్ని ప్రాంతాల్లో ఈ సంఖ్య ఎక్కువగా కూడా ఉంది. అయితే వీరికి అదనంగా మరో పది వరకు సర్వే పత్రాలను ఇచ్చారు. ఉమ్మడి కుటుంబాలు వేరుపడి విడిగా వివరాలు నమోదు చేసుకునే వీలుంది. అన్నదమ్ములు, తల్లిదండ్రులు, పిల్లలు విడిగా నమోదు చేసుకుంటే ఆమోదిస్తామని అటు ప్రభుత్వం..ఇటు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే కుటుంబాల సంఖ్య కోటి దాటుతుందని చెబుతున్నారు. సర్వే జరిగిన తర్వాత ఈ పత్రాలను ఎంపిక చేసిన దాదాపు 19 వేల కంప్యూటర్ డేటా ఎంట్రీ కేంద్రాలకు పంపిస్తారు. ఇక్కడే కుటుంబాల వివరాలు నమోదు చేస్తారు. దాదాపు లక్షల మంది ఉద్యోగులు ఈ కేంద్రాల్లో విధులు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ నాలుగు నాటికి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం ముసాయిదా జాబితాను రూపొందిస్తారు. వాటి ఆధారంగా మళ్లీ సెప్టెంబర్ 10వ తేదీ నుంచి సర్వేలోని వివరాలను తనిఖీలు చేస్తారు. సర్వేలో కేటాయించిన ఇంటి నంబర్ల ఆధారంగా ఈ తనిఖీ జరుగుతుంది. ఈ ఒక్క రోజు సర్వే తర్వాత తెలంగాణ సర్కార్ భారీ కసరత్తే చేయనుంది. మొదటగా సర్వే వివరాలు తనిఖీలు జరిగిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులతోపాటు.. బహుళ ప్రయోజన కార్డులను జారీ చేయనుంది. ప్రభుత్వం ప్రకటించే అన్ని రకాల పథకాలతోపాటు ఇతర ధ్రువీకరణలకు, దరఖాస్తులన్నింటీకి దీనిని పరిగణలోకి తీసుకుంటున్నారు. వీటి ఆధారంగానే ఆయా కుంటుబాలకు సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారు. సమగ్ర సర్వే తర్వాత ఒక్కో కుటుంబానికి ఒక్కో సంఖ్యను కేటాయిస్తున్న ప్రభుత్వం... దానిని గుర్తింపు కార్డులపై ముద్రించి ప్రజలకు ఇవ్వనుంది. ఈ కార్డుల జారీ ప్రక్రియ అక్టోబరులో ప్రారంభం కానుంది. సర్వే సమాచారం ఆధారంగానే రేషన్ కార్డులు, పించన్ల మంజూరుతోపాటు ఇతర పథకాల లబ్ధిదారులను గుర్తిస్తారు. కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకీ వీటిని తప్పనిసరి చేయనున్నారు. ఇవేగాక కార్డులను బహుళ వినియోగంలోకి తేవడం ద్వారా ప్రభుత్వం ఆలోచిస్తోంది. పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఖాతా, ఓటరు గుర్తింపు కార్డుల దరఖాస్తు కోసం ఈ కార్డును ప్రామాణికం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వీటిని దరఖాస్తు చేసుకునేటప్పుడు రేషన్ కార్డుతోపాటు ప్రభుత్వం ఇచ్చిన ఇతర ధృవీకరణ పత్రాలను జత చేస్తున్నారు. ఈ జాబితాలో ఇకపై ఈ గుర్తు కార్డును చేర్చే ఛాన్స్ ఉంది. సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబ సభ్యులు, చిరునామా, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలు తీసుకుంటున్నందున అన్ని రకాల దరఖాస్తులకు ఇది ఉపయెగపడుతుందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. బోగస్ కార్డుల ఏరివేతతోపాటు అర్హులైన వారికే ప్రభుత్వ పథకాలు వర్తింప చేసేందుకు ఇదీ ఎంతో ఉపయోగంగా ఉంటుందని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ సమగ్ర సర్వే పై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. విపక్షాలు సైతం ఈ సర్వేపై కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి. ఇదీ కేవలం సీమాంధ్రలను టార్గెట్ చేసి చేస్తున్న సర్వే అనే విమర్శలు సైతం వచ్చాయి. బ్యాంక్ అకౌంట్ నంబర్లు, భూములు వివరాలు అడగడంపై కూడా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీల నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొందరు దీనిపై హై కోర్టుకు సైతం వెళ్లారు. అయితే తెలంగాణ సర్కార్ కూడా సర్వే ఐచ్చికమేనని కోర్టుకు తెలిపింది. తాము ప్రవేశపెట్టే ప్రభుత్వ పథకాలను సమగ్రంగా అమలు చేసేందుకు చేస్తున్న సర్వేగా తెలిపింది. సర్వే పై విపక్షాలు విమర్శలు చేయడంపై కూడా కేసీఆర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కొత్తకొత్త అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయ్. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన సమగ్ర సర్వే కార్యక్రమంతో అనేక సమస్యలు, అంశాలు ముడిపడి ఉన్నాయి. అరకొర సమాచారంతో మిశ్రమ ఫలితాలు సాధించడం కన్నా సమాచారం సేకరించకపోవడమే మేలు. ఈ సర్వే మరో ఆధార్‌ కార్డు కార్యక్రమంలాగా వివాదం కాకూడదు. హాస్యాస్పదం కాకూడదు. సమస్యగా మారకుండా సర్వే కొనసాగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: