వచ్చే అసెంబ్లీ సమావేశాలను ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించుకుంటామని స్పీకర్ కోడెల శివప్రసాద రావు సూచనప్రాయంగా చెప్పారు. వచ్చే సమావేశాలను విజయవాడలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపారు. ఇలాఉండగా స్పీకర్ కోడెల అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సోమవారం సమావేశమైంది. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు, అసెంబ్లీ కార్యదర్శి (ఇన్‌ఛార్జీ) కె సత్యనారాయణ, డిప్యూటీ సెక్రటరీ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వర్షాభావంతో తలెత్తిన సమస్యలు, అల్లాడుతున్న రైతులు, విద్యుత్తు సమస్య, రుణ మాఫీ, ఇళ్ళ నిర్మాణం వంటి సుమారు 20 ప్రధాన అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. స్పీకర్ కోడెల శివప్రసాద రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 10న ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, అంతకంటే ముందే సమావేశాలు ముగించుకోవడానికి వీలుగా శనివారాలు పని చేద్దామని చేసిన సూచనకు అందరూ సమ్మతించారు. శనివారాలు పనిచేయకపోతే వచ్చే నెల 13వరకు నిర్వహించాల్సి ఉంటుంది. గవర్నర్ సమక్షంలో ఆదివారం జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలోనూ ఈ అంశంపై చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చేసిన సూచన మేరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే తమ అసెంబ్లీ సమావేశాలు ముగించేందుకు యత్నిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: