"శుభకార్యాలు వద్దు, ప్రయాణాలు పెట్టుకోవద్దు, ఇల్లు కదిలి ఎక్కడికీ వెళ్లొద్దు... ముఖ్యమంత్రి అయినా, ఆయన సహచర మంత్రులైనా, ఐఏఎస్ అధికారులైనా ఎవ్వరికీ మినహాయింపు లేదు" నేటి సమగ్ర సర్వే నేపథ్యంలో గడిచిన 20 రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ నొక్కి వక్కాణించిన మాటలివి. శ్రావణ మాసమే అయినందున ఈరోజు పెళ్లిల్లున్నా వాయిదా వేసుకోమని సూచించారు. ఆర్టీసీ బస్సులు, పెట్రోలు బంకులే ఉండనందున ప్రయాణాలు పెట్టుకోవద్దని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతే అంత గట్టిగా చెప్పడంతో నేడు రాష్ట్రమంతటా బంధ్ వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు స్కూళ్లు, వ్యాపార వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, హోటళ్లు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు, మద్యం దుకాణాలు... ఇలా చెప్తూ పోతే చాంతాడంత అవుతుందేమో నేడు మూత పడిన వాటి సంఖ్య. తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రతి మనిషీ, తెలంగాణలో స్థిరపడిన ప్రతి వ్యక్తీ, తెలంగాణలో నివసిస్తున్న ప్రతి వ్యక్తీ... అందరూ సర్వేలో కచ్చితంగా పాల్గొనాలనే నిబంధనతో అన్నీ మూతపడ్డాయి. హైదరాబాద్ నుంచి మారు మూల మండల కేంద్రాల వరకూ అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచీ కాటికి కాలు చాపిన పండు ముసలి వరకు ఎవ్వరికీ మినహాయింపు లేకపోవడంతో అన్ని పనులూ ఆగిపోయాయి. ఆర్టీసీ బస్సుల్లేవు, ప్రైవేటు వాహనాలు రావు, సొంత బండ్లో వెళ్దామంటే పెట్రోల్ బంకులు లేవు. ఇదీ ఇవాళ తెలంగాణ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో పరిస్థితి. బంధ్ రాష్ట్ర ప్రజలకు గడిచిన నాలుగేళ్లుగా కామన్ విషయమే... కానీ ఈ స్థాయిలో జరగడం మాత్రం గతంలో చాలా అరుదు. సినిమా థియేటర్లు, మద్యం దుకాణాల వంటివి కూడా ఎవ్వరూ పిలుపునివ్వకుండానే మూతపడ్డాయంటే బంధ్ తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పరిస్థితి సాయంత్రానికైనా కుదుట పడి స్తంభించిన జన జీవనానికి వెసులుబాటు కల్పిస్తుందో... లేదో అన్నదో... ఇప్పుడు గ్రామాలకు చేరుకున్న వారి మదిని తొలుస్తున్న ప్రశ్న. రేపటి వర్కింగ్ డే కి మళ్లీ అందుకోవాలన్నదే అసలు ఆరాటం.

మరింత సమాచారం తెలుసుకోండి: