సికింద్రాబాద్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ సైనికాధికారి పటన్ కుమార్ పోద్దార్.. పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్ అనుష్క అగర్వాల్ కు పంపిన మిలటరీ రహస్య పత్రాలు సీసీఎస్ పో లీసుల చేతికి చిక్కాయి. అయితే పోలీసుల విచారణలో పలు నిజాలు వెలుగు చూశాయి. దేశంలోని 12 ఆర్మీ యూనిట్ల ప్రాంతాలు, సైనికాధికారుల పేర్లు, ఏయే యూనిట్లో ఏయే ఆయుధాలు ఎక్కడెక్కడ ఉంటాయనే విషయాలను పటన్ పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్‌కు అందించాడు. పటన్ నుంచి నాలుగు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, బ్లూ టూత్, మూడు సెల్‌ఫోన్లు, నాలుగు పెన్‌డ్రైవ్‌లు, 10 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు రికవరీ చేశారు. రికవరీ పత్రాలు, ఫొటోలను పంపినట్టు పటన్ అంగీకరించాడు. ఆర్మీ యూనిట్లు, అధికారుల సమావేశాల ఫొటోలు, మిస్సైల్ ఫొటోలు ఇందులో ఉన్నాయి. ఆర్మీ మిస్సైల్స్ నిల్వ కర్మాగారాలు, మిలటరీ అధికారుల రహస్య సమావేశాలు, వాటి ఎజెండా గురించి కూడా పటన్ తన ఈ మెయిల్, ఫేస్‌బుక్ ద్వారా ఆమెకు పంపించాడు. దేశ సరిహద్దులో ఏ సెక్టార్‌లో ఎంత మంది ఉంటారు, వారు ఎన్ని రోజులకు మారుతుంటారు, కొత్తగా వచ్చే బృందాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేవాడు. సైనిక రహస్యాలు పంపినందుకు అనుష్క తనకు రూ.74 వేలు పలు మార్లు బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసిందని పటన్ విచారణలో వెల్లడించాడు. అత్యంత క్రమశిక్షణకు మారుపేరైన మిలటరీలో పనిచేస్తున్న తాను అనుష్క మోజులో పడి మోసపోయానని అతడు అంగీకరించాడు. తాను రహస్యాలు పంపకపోతే ఆమె తనను బ్లాక్‌మెయిల్ చేసి ఉండేదని, అందుకు భయపడి సహకరించానని విచారణాధికారులకు చెప్పాడు. తప్పు చేసినందుకు పశ్చాత్తాప పడుతున్నానని పేర్కొన్నాడు. పటన్ పాక్‌కు పంపిన రహస్యాల కాపీలను నగర పోలీసులు కేంద్ర రక్షణ రంగ అధికారులకు పంపారు. చంచల్‌గూడ జైలులో ఉన్న పటన్‌ను త్వరలో మిలటరీ మార్షల్ కోర్టులో హాజరు పర్చేందుకు ఆర్మీ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: