తెలంగాణలో సమగ్ర సర్వే దేశం ఆశ్చర్యపడేలా జరిగిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సర్వేతో ఎన్నో వాస్తవాలు బయటపడతాయని అన్నారు. సర్వేకు ఊహించని రీతిలో జనం సహకరించారన్న విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సర్వేను ప్రజలు స్వాగతించారని.. ఎన్యుమరేటర్లకు బాగా సహకరించారని ఆయన వివరించారు. అద్భుతంగా ఈ కార్యం పూర్తి చేసిన ఉద్యోగులు, గణకులను ఆయన ప్రసంశించారు. చాలాచోట్ల సర్వే 80-90 శాతానికి పైగా పూర్తయిందన్నారు. అవసరాన్ని బట్టి సర్వేను పొడిగించాలా వద్దా అనేది నిర్ణయిస్తామన్నారు. చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు సైతం సర్వేలో నమోదు చేసుకున్నారని కేసీఆర్ మెచ్చుకున్నారు. ఈ సర్వేపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ముందు ముందు దాదాపు అన్ని రాష్ట్రాలు తమ సర్వేను అనుసరిస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం సైతం ఈ సర్వేను అనుసరించినా ఆశ్చర్యపోనవసరం లేదని చంద్రశేఖర్ రావు అన్నారు. భద్రాచలం ముంపు మండలాల్లో సర్వే జరగలేదని.. ఆ ప్రాంతాలు ఆంధ్రాలో కలసిపోయాయని.. వాటిపై చర్చ అనవసరమని సీఎం కేసీఆర్ తొలిసారి మీడియా ముందు అంగీకరించారు. సర్వేను విమర్శించిన రాజకీయ నాయకుల గురించి మాట్లాడిన కేసీఆర్.. వారు తమ పరువును తామే తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ సర్వే ద్వారా హైదరాబాద్ జనాభా కోటీ 20 లక్షలు మించిపోతుందన్నారు కేసీఆర్.. మొత్తం తెలంగాణ జనాభా ఇప్పటివరకూ మూడున్నరకోట్ల వరకూ ఉంటుందని అనుకున్నామని.. ఇప్పుడు ఈ జనాభా నాలుగున్నరకోట్ల వరకూ వెళ్తోందని వివరించారు. ఈ సర్వే ఆధారంగా ప్రజలు మరిన్ని మేలైన కార్యక్రమాలు రూపొందిస్తామని కేసీఆర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. తెలంగాణ సమాజం ఇదే స్ఫూర్తిని చూపి తనకు సహకరిస్తే.. త్వరలోనే బంగారు తెలంగాణ కలను సాకారం చేసి చూపుతానని కె. చంద్రశేఖర్ రావు అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: