తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉదయం ప్రారంభమై రాత్రి పొద్దుపోయే వరకు జోరుగా కొనసాగింది. ఎన్యూమరేటర్లు ఎదుర్కొన్న స్వల్ప ఇబ్బందులు, సామాగ్రి అందడంలో ఆలస్యం, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నెంబర్లను గుర్తించడంలో కొన్ని ఇక్కట్లు మినహా సర్వే ప్రశాంతంగా సాగిందని డిజిపి కార్యాలయానికి సమాచారం అందింది. కాగా, ఈ సర్వే కారణంగా తెలంగాణ వ్యాప్తంగా రవాణావ్యవస్థ పూర్తిగా స్తంభించిపోగా, రహదారులన్నీ బోసిపోయాయి. నిత్యం లక్షలాది వాహనాలతో రద్దీగా వుండే జంట నగరాలు, శివారు ప్రాంతాల్లో రోడ్లపై జనం లేక కర్ఫ్యూ వాతావరణంలా కనిపించగా, రైల్వేస్టేషన్లలోనూ జనం సందడి కానరాలేదు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు సర్వే నిమిత్తం నియమితులైన ఎన్యూమరేటర్లు చాలాచోట్ల ఆలస్యంగా చేరుకోగా, ఇంకొన్నిచోట్ల సిబ్బంది జాడ లేక పోవడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా వున్న ప్రజల వివరాలను సేకరించే నిమిత్తం సర్కారు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పూర్తి కావచ్చింది. మంగళవారం ఒకే రోజున దీనిని నిర్వహించి ఎంత రాత్రి అయినా పూర్తి చేయాలని సర్కారు ఆదేశించడం తెలిసిందే. ఈ సర్వే కోసం అన్ని జిల్లాల్లో మూడు లక్షల 71 వేల మంది ఉద్యోగులను ఎన్యూమరేటర్లుగా నియమించడం విదితమే. సర్వేకు నియమించబడ్డ సిబ్బంది కొన్నిచోట్ల రెండు రోజుల ముందుగానే చేరుకోగా, ఇంకొన్ని చోట్ల ఒక రోజు ముందుగా చేరుకున్నారు. అధికారికంగా మంగళవారం ఈ సర్వే ప్రారంభమైనా కొన్ని చోట్ల అంతకన్నా ముందుగానే మొదలయింది. చాలాచోట్ల మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతాలకు చేరుకుని వివరాలు సేకరించారు. జంట నగరాలు, శివారు ప్రాంతాలోని కొన్ని చోట్ల ఎన్యూమరేటర్లకు భాష సమస్య ఇబ్బందిగా మారింది. చాలా మంది ఎన్యూమరేటర్లకు హిందీ, ఉర్దూ భాషలు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే, ఆయా ప్రాంతాలలోని యువకులు దుబాసీలుగా మారి ఎన్యూమరేటర్లకు సహకరించారు. జంటనగరాలు, శివారు ప్రాంతాలలోని కొన్నిచోట్ల ఎన్యూమరేటర్లు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ఇళ్లు వుండడంతో వివరాల సేకరణ ఆలస్యమైంది. ముఖ్యంగా పాతబస్తీలో ఈ సమస్య అధికంగా కనిపించింది. సర్వేల సందర్భంగా ప్రజలు ఇళ్ల వద్దే వుండాలని, ఎక్కడికి వెళ్లరాదని సర్కారు ముందుగానే తెలపడంతో రోడ్లపై జనం నామమాత్రంగా కూడా కనిపించలేదు. నిత్యం రద్దీగా వుండే హైదరాబాద్‌, సైబరాబాద్‌లోని అనేక రహదారులు బోసిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రధాన మార్కెట్లు పనిచేయ లేదు. కొన్నిచోట్ల మార్కెట్లు తెరచివున్నా కొనుగోలుదారులు లేక వెలవెలపోయాయి. సర్వే సందర్భంగా సర్కారు సెలవు ప్రకటించిందని ప్రైవేటు సంస్థలు ఈ విషయాన్ని గుర్తించి, ఉద్యోగులకు సెలవివ్వాలని బల్దియా, కార్మికశాఖ అధికారులు వాహనాలలో తిరుగుతూ ప్రచారం చేయడం గమనార్హం. కొన్నిచోట్ల ప్రైవేటు సంస్థలు తెరచి వుండగా అధికారులు వాటిని మూసి వేయించారు. ఆఖరుకు హోటళ్లు కూడా మూసివేయడం విశేషం. సర్వే ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా రైల్వేస్టేషన్లలోనూ కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: