ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రకటన చూసి బావురుమంటున్న వాళ్లలో ముఖ్యమైన స్థానంలో ఉన్నారు బ్యాంకుల వాళ్లు, డ్వాక్రా మహిళలు! డ్వాక్రా రుణాల మాఫీ కి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంతో ఈ వర్గాలు అవాక్కయ్యాయి. ప్రత్యేకించి మహిళలు అయితే దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఎన్నికల ముందు ఇచ్చిన రుణమాఫీ అమలవుతుందా? లేదా? అనేది వారికి అంతుబట్టని వ్యవహారం గా మారింది. దాదాపు ఎన్నికలకు అరు నెలల ముందునుంచినే డ్వాక్రా మహిళల్లో ఒక ముసలం మొదలైంది. అప్పటికే తెలుగుదేశం పార్టీ రుణమాఫీ హామీని ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే రుణమాఫీని చేస్తామని గ్రామీణ స్థాయిలో తెలుగుదేశం నేతలు డ్వాక్రా మహిళలకు ప్రామిస్ చేస్తూ వచ్చారు. మాకు ఓట్లు వేయండి.. మీరు రుణాలను చెల్లించాల్సిన అవసరం ఉండదు.. అని వారు చెబుతూ వచ్చారు. దీంతో నెల నెలా చెల్లింపులు చేసే మహిళలల్లో ఒక అలసత్వం వచ్చింది. ఎలాగూ రుణమాఫీ అంటున్నారు.. ఎందుకు అనవసరంగా చెల్లించడం.. అని మూకుమ్మడిగా తీర్మానించుకొన్నారు. గ్రూపుల వారీగాబ్యాంకులకు తీసుకొన్న అప్పులు చెల్లించడం మానేశారు. గ్రూపులో ఎవరో ఒకరు చెల్లించడం మానేస్తే రచ్చ చేసే మహిళలు.. అందరూ ఉమ్మడిగా తీసుకొన్న నిర్ణయంతో బ్యాంకులకు డబ్బులు చెల్లించడం మానేయడంతో అడిగే వారు లేకుండా పోయారు! మరి ఆరు నెలలుగా ఇలాంటి పరిస్థితే ఉంది. బ్యాంకులకు, మహిళలకు సంబంధాలు తెగిపోయాయి. అంత వరకూ నెలనెలా టంచనుగా చెల్లింపులు చేసే మహిళలు మొండిఘటాలుగా మారిపోయారు. ఇక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతోటి వారికి మరింత ఉత్సాహం వచ్చింది. ఇక రుణాలే చెల్లించాల్సిన అవసరం లేదని వారు అనుకొన్నారు. మహిళలు ఇలా భావించడం బ్యాంకుల పాలిట విషాదంగా మారింది. మంచి కస్టమర్లుగా ఉండిన మహిళలు ఇలా మొండిఘటాలుగా మారడంతో ట్రాన్సక్షన్లు అన్నీ ఆగిపోయాయి. మరి బడ్జెట్ తోనైనా కదలిక వస్తుంది... ప్రభుత్వం ఏదో ఒకటి తేలుస్తుందని అనుకొంటే.. ఇప్పుడు అది కూడా జరగలేదు. దీంతో బ్యాంకర్లు బావురుమంటున్నారు. మహిళల ముక్కుపిండి డ్వాక్రా రుణాలను వసూలు చేయడానికి సిద్ధపడుతున్నారు. మరి ఇక మహిళలు బావురుమనాలేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: