ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోసం ప్రభుత్వం మరో రెండు జతల(16) నూతన వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతమున్న వాహనశ్రేణికి తోడుగా జిల్లా పర్యటనలకు వెళ్ళినపుడు ఈ నూతన వాహనాలను వినియోగించే విధంగా పోలీస్‌ శాఖ చర్యలు చేపట్టనుంది. రాష్ట్రం విడిపోవడంతో ముఖ్యమంత్రి తరచూ రాయలసీమ, కోస్తా జిల్లాల్లో పర్యటనలకు వెళుతున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న వాహనశ్రేణిని ఇక్కడే ఉపయోగించాలని కొత్తగా కొనుగోలు చేస్తున్న రెండు జతల వాహనాల్లో ఒక జతను తిరుపతిలో, మరో జతను విజయవాడలో ఉంచాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రతి జతలో రెండు బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలతోపాటు జామర్‌ వాహనం, మరో ఐదు సాధారణ వాహనాలు ఉంటాయి. పోలీస్‌ శాఖ తొలుత ఫోర్డ్‌ కంపెనీకి చెందిన ఎండీవర్‌ వాహనాలను ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. లగ్జరీగా ఉండే ఇండీవర్‌ వాహనాల్లో తిరగడం బాగుండదని చంద్రబాబు చెప్పడంతో డీజీపీ జె.వి. రాముడు టయోటా కంపెనీకి చెందిన ఫార్చునర్‌ వాహనాలను కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. ఈ విషయాన్ని డీజీపీ, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తేగా టాటా కంపెనీకి చెందిన సఫారీ వాహనాల్లో ప్రయాణం చేస్తే తనకు ఉల్లాసంగా ఉంటుందని, గత పదేళ్ళుగా సఫారీ వాహనాలనే తాను ఉపయోగిస్తున్నానని, కొత్తగా కొనుగోలు చేసే వాహనాలను కూడా ఇదే కంపెనీకి చెందినవి ఉండేలా చూడాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో డీజీపీ రాముడు ఎండీవర్‌, ఫార్చునర్‌ వాహనాల కొనుగోలుకు ఆయా కంపెనీలకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి సఫారీ వాహనాలను తెప్పించేందుకు చర్యలు చేపట్టారు. నాలుగు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను తయారుచేయాలంటే కనీసం రెండు నెలల వ్యవధి పడుతుందని, సెప్టెంబర్‌ చివర లేదా అక్టోబర్‌ తొలి వారంలో ఈ నూతన వాహనాలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జామర్లను కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేయాలని నిర్ణయించారు. ప్రధాని, రాష్ట్రపతితోపాటు దేశ పర్యటన నిమిత్తం ఇక్కడకు వచ్చే అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే సమయంలో ఉపయోగించే జామర్‌ పరిజ్ఞానాన్ని చంద్రబాబు వాహన శ్రేణిలోని జామర్‌కు ఉపయో గించాలని నిర్ణయించినట్లు సమా చారం. జిల్లా పర్యటనకు వెళ్లే సమయంలోనూ హైదరాబాద్‌లో ఉన్న వాహనాలనే అక్కడా వాడే పరిస్థితి ఉంటోంది. పర్యటనకు రెండ్రోజుల ముందు హైదరాబాద్‌ నుంచి వాహనాలను జిల్లాలకు పంపించే పరిస్థితి నెలకొంది. ఒక్కోసారి జిల్లా ఎస్పీ ఏర్పాటు చేస్తున్న బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు మొరాయిస్తుండడంతో మరో వాహనంలో ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడుతోంది. మంత్రులు, ఇతర ముఖ్యులు తరచూ జిల్లా పర్యటనలకు వెళ్తున్నారని, ఒకేసారి మంత్రులంతా ఆయా జిల్లాల్లో పర్యటిస్తుండడంతో వారి వాహనాలను సమకూర్చలేని పరిస్థితిలో జిల్లా యంత్రాంగం ఉందని తెలుస్తోంది. ఈ సమస్యలన్నీ అధిగమించడానికి వీలుగా 16 వాహనాలతో కూడిన రెండు జతల వాహనశ్రేణిని జిల్లా పర్యటనలో ఉపయోగించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నిర్ణయించింది.  కొత్తగా కొనుగోలు చేస్తున్న వాహనాల్లో అత్యంత ఆధునిక సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. డ్రైవర్‌ పక్క వెనుక సీటులో కూర్చుని ప్రయాణించడంతోపాటు జిల్లా పర్యటనలో ఆ సీటు పక్కన నిలబడి బహిరంగ సభలో మాట్లాడేందుకు వీలుగా సౌకర్యం కల్పించాలని వాహనాలను తయారుచేస్తున్న టాటా సంస్థను కోరినట్లు సమాచారం. ముంబైలో తయారవుతున్న ఈ వాహనాలను పోలీస్‌ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఇప్పటికే రెండు దఫాలు అక్కడికి వెళ్ళి పరిశీలించారని, మార్పులుచేర్పులపై సలహాలు కూడా ఇచ్చారని ఈ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు నూతన వాహనాలను కొనుగోలు చేయాలని అప్పటి ప్రభుత్వాలను కోరినా పెడచెవిన పెట్టారని, చివరికి ఆయనే తన సొంత డబ్బుతో రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను కొనుగోలు చేసుకున్నారని చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే తెదేపా ప్రముఖ నేత ఒకరు చెప్పారు. లగ్జరీ కార్లలో తిరగాలన్న ఆశ, ఆకాంక్ష తమ నాయకుడికి లేదని, ప్రయాణించడానికి వీలుగా ఏ వాహనమున్నా అందులో కూర్చొనేందుకు చంద్రబాబు సిద్ధమని గుర్తుచేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావుకు ప్రభుత్వం ఫార్చునర్‌ వాహనాలను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. గతంలో ముఖ్యమంత్రి పనిచేసిన కిరణ్‌కుమార్‌ రెడ్డి సైతం ఇదే కంపెనీ వాహనాలను వాడారు. వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి తనకు అత్యంత ఇష్టమైన స్కార్పియో వాహనాలను ఎంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: