రాజధాని అంశంపై ఇన్నాళ్లూ ఎటూ తేల్చుకోలేకపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఓ క్లారిటీకి వచ్చేసింది. విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని దాదాపుగా రాజధానిగా భావిస్తూ ఏపీ సర్కారు ముందుకు వెళ్తున్న తరుణంలో ఇన్నాళ్లూ ఈ విషయంపై జగన్ పార్టీ మల్లగుల్లాలు పడింది. విజయవాడ-గుంటూరు ప్రతిపాదన ఆ పార్టీలో చాలా మందికి నచ్చకపోయినా.. ఏ నగరానికి ఓటేస్తే.. ఏ ప్రాంతం వాళ్లు ఏమనుకుంటారోనన్న సందేహం ఆ పార్టీని వేధించింది. చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా దొనకొండకే రాజధానిగా ఓటేస్తూ అసెంబ్లీలో ఓ ప్రకటన చేసింది. దొనకొండకు రాజధానిగా ఉన్న సానుకూలతలను జగన్ పార్టీ సభ్యుడు గొట్టిపాటి రవికుమార్ శనివాసం అసెంబ్లీలో వివరించారు. దాదాపు 11వేల ప్రభుత్వ భూములు అక్కడ అందుబాటులో ఉన్నాయని సాక్షాత్తూ మంత్రి నారాయణే ప్రకటించారు. ఇప్పటికే విమానాశ్రయం ఉంది. సాగునీరు సమస్య ఉందని అందరూ చెబుతున్న మాటలు వాస్తవం కాదని.. దర్శి కెనాల్ నుంచి నీరు తీసుకోవచ్చని జగన్ పార్టీ వాదిస్తోంది. దొనకొండను సపోర్ట్ చేయడంతో పాటు.. రాజధాని విషయంలో మంత్రుల తీరును కూడా జగన్ పార్టీ ఏకిపారేసింది. కనీసం శివరామకృష్ణన్ కమిటీ పర్యటన కూడా పూర్తి కాకుండానే బెజవాడ-గుంటూరు ప్రాంతమే రాజధాని అని ఎందుకు ప్రకటిస్తున్నారని జగన్ పార్టీ నిలదీసింది. ఓపక్క విభజన కారణంగా ఆర్థిక నష్టాల్లో ఉన్నామని చెబుతూనే రాజధాని కోసం లక్షల కోట్లు ఎలా ఖర్చుచేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించారు. 11వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న ప్రాంతాన్ని వదిలేసి... భూముల ధరలు విపరీతంగా ఉన్న ప్రాంతంలో రాజధాని పెడితే.. అందుకు అవసరమైన డబ్బు ఎలా తెస్తారని ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా దొనకొండ అయితే రాయలసీమ వాసులకు కూడా భౌగోళికంగా దగ్గరగా ఉంటుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: