అందరివాడు... ఆపద మొక్కుల వాడు... ఏడుకొండల పైన వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు. తెలుగు వారితోపాటు భారత దేశమే కాక విదేశీ భక్తుల పాలిట కూడా కొంగు బంగారమే ఈ శ్రీనివాసుడు. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడంతో వెంకటేశ్వరుడి పాలక మండలిలోనూ మార్పులకు కారణం కానుంది. దేవ దేవుడి అభివృద్ధి, పర్యవేక్షణనూ తిరుమల తిరుపతి దేవస్థానం - టీటీడీ చూసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు సర్కార్ టీటీడీ పాలక మండలితో పాటు అన్ని దేవాలయాల కమిటీలను రద్దు చేసింది. అయితే కొత్త కమిటీ ఏర్పాటు చేయనున్న టీడీపీ ప్రభుత్వం... అందులో తెలంగాణకు చోటు ఇస్తుందా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. తెలంగాణ నుంచి ముగ్గురికి అవకాశం ఇస్తామని స్వయంగా చంద్రబాబే తేల్చిచెప్పారు. మొన్నటి దాకా టీటీడీ పాలక మండలిలో ఉమ్మడి రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచీ ఇద్దరు సభ్యులను తీసుకునేవారు. అయితే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో సహచర తెలుగు రాష్ట్రమైన తెలంగాణను కూడా పొరుగు రాష్ట్రంగానే భావించాలా...? లేదంటే గతంలో మాదిరిగా టీటీడీలోకి ఆహ్వానించాలా...? అనే అంశం పై ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడింది. భౌగోళికంగా తిరుమల రాయలసీమలో ఉన్నప్పటికీ వెంకటేశ్వరుడి దర్శనానికి మాత్రం దేశ, విదేశాల నుంచీ భక్తులు విరివిగా వస్తుంటారు. దీంతోపాటు టీటీడీకి తెలంగాణలోనూ పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి. అందుకే తెలంగాణ నుంచి ఒక ఉన్నతాధికారిని మండలిలోకి తీసుకుంటే బాగుంటుందనే ఆలోచననూ ప్రభుత్వం చేసింది. గతంలో టీటీడీ పాలక మండలిలో రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా సభ్యులను తీసుకునేవారు. అయితే ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేదు. తెలంగాణ నుంచి కూడా పొరుగు రాష్ట్రాల మాదిరిగా ఇద్దరు సభ్యులు కాకుండా... మరొకరికి అధనంగా అవకాశం కల్పించేందుకు టీడీపీ సర్కార్ ప్లాన్ రెడీ చేసింది. అయితే ఈ ముగ్గురూ కచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం నేతలే అవుతారనేది జరమెరిగిన సత్యమే. సభ్యులను తామే నామనేట్ చేయాలా? లేకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని సూచించమని అడుగుదామా? అనే ఆలోచన కూడా బాబు ప్రభుత్వం ఓ దశలో చేసింది. చివరికి మాత్రం ఏపీ సర్కారే బోర్డు సభ్యులను నిర్ణయిస్తూ... పొరుగు రాష్ట్రాల కంటే ఒక్క సీటు ఎక్కువ తెలంగాణకు కేటాయించింది. దీని పై ఇంకా కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్వందనా రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: