స్వానుభవం అయితే కానీ తత్వం బోధపడదని ఓ నానుడి. తనదాకా వస్తే కానీ.. ఎవరికీ సిట్యుయేషన్ సరిగ్గా అర్థం కాదు. కానీ అర్థమయ్యేసరికి.. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పిపోతుంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజా పరిస్థితి ఈ నానుడి సరిగ్గా సరిపోతుంది. సామాన్యుడి శ్రేయస్సే తన ఎజెండాగా ఢిల్లీ రాజకీయాల్లోకి దూసుకొచ్చిన ఈ అసామాన్యుడి అనుభవరాహిత్యంతో తప్పుమీద తప్పు చేసి పప్పులో కాలేశాడు. ఇప్పుడు తీరిగ్గా చింతిస్తున్నాడు. కాంగ్రెస్‌, బీజేపీల పాలనతో విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు ఆమ్‌ ఆద్మీ పార్టీని, కేజ్రీవాల్‌ను నమ్మి అధికార పీఠాన్ని ఆయనకు అప్పగించారు. కాంగ్రెస్‌ మద్దతుతో అనూహ్యంగా సీఎం కుర్చీ ఎక్కిన కేజ్రీవాల్.. ఆ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు. పాలన సాగించే ఉద్దేశంలేక.. పాలించిన 49 రోజులూ ఎప్పుడెప్పుడు పీఠాన్ని దిగిపోదామా అన్నట్లు ప్రవర్తించాడు. అధికారాలు పూర్తిగాలేని సీఎం పదవి ఎందుకంటూ రాజీనామా చేసి జనం ఆశలు వమ్ము చేశాడు. కేజ్రీవాల్‌పై విశ్వాసముంచి, ఆయన విజయం కోసం అహర్నిశలూ ప్రచారం చేసిన సామాన్యుడు మాత్రం కేజ్రీవాల్‌ తమను మోసం చేసాడని భావించారు. అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ ఏకంగా పీఎం సీటుపై దృష్టిపెట్టడమే ఆయన కొంప ముంచిందని విశ్లేషకులు చెబుతారు. ఆయన అత్యాశే ఆయన రాజకీయ జీవితాన్ని అభాసుపాలు చేసిందని విశ్లేషిస్తారు. పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా భంగపడి.. ఇప్పుడు క్రమంగా రాజకీయాల నుంచి ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు. తాజాగా తెలివితెచ్చుకుని.. ఎవరైనా సరే వచ్చిన పదవిని వదలుకోకూడదని ఇప్పుడు అర్థమైందని కామెంట్ చేశాడు. ఈసారి అధికారంలోకి వస్తే మాత్రం కచ్చితంగా ఐదేళ్లుపాలిస్తామని అంటున్నాడు. ఆయనకు తెలివి వచ్చింది సరే.. మరి మేమే అంత తెలివి తక్కువవాళ్లమా.. మరోసారి కేజ్రీవాల్ కు అధికారం అప్పగించడానికి అంటున్నారు ఢిల్లీ జనం..

మరింత సమాచారం తెలుసుకోండి: