సీమాంధ్రలోనే అతిపెద్ద సిటీ అయినా.. రాజధాని రేసులో అంతగా వినిపించని నగరమే విశాఖపట్నం. విశాల సాగరతీరం.. దేశంలోనే ప్రాముఖ్యం పొందిన పోర్టు.. విమానాశ్రయం, ఇప్పటికే అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు, పర్యాటక నగరంగా గుర్తింపు, నౌకాదళానికి కీలక స్థావరం..ఇప్పటికే కొలువు దీరిన ఐటీ సంస్థలు.. అందుబాటులో ప్రభుత్వ భూములు.. ఇలా ఎన్నో అర్హతలున్నా.. విశాఖ మాత్రం రాజధాని రేసులో వెనకే ఉంది. బెజవాడ-గుంటూరు, కర్నూలు, దొనకొండ ఇలాంటి పేర్లు వినిపిస్తున్నాయి కానీ విశాఖను రాజధాని చేద్దామని అన్నవారే కనిపించడం లేదు. విశాఖ అంతగా వెనుకబడటానికి ప్రధాన కారణం.. భౌగోళికంగా దానికి ఉన్న అనర్హతే. రాష్ట్ర్రానికి ఓ మూలగా ఉండటం వల్ల విశాఖను రాజధాని చేయాలన్న డిమాండ్ పెద్దగా వినిపించడంలేదు. రాజధాని కాకపోయినా సీమాంధ్రలో మంచి భవిష్యత్ ఉన్న నగరం విశాఖే. అందుకే ఇప్పుడు విశాఖ నుంచి నేరుగా అమెరికాలోని వివిధ నగరాలను విమానాలను నడపాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. తాజాగా వైజాగ్ లో జరిగిన ఓ జాతీయ సదస్సులో ఏపీ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్. ఎన్. రెడ్డి ఇదే విషయం మీడియాకు చెప్పారు. అంతేకాదు.. ఇకపై విశాఖ విమానాశ్రయానికి బోయింగ్ 777 విమానాలు, డ్రీమ్ లైనర్లు కూడా రాబోతున్నాయట. విమానయానరంగంలో మాత్రం విశాఖకు మంచి ఫ్యూచర్ ఉందని రెడ్డి అభిప్రాయపడ్డారు. పదివేల అడుగుల విశాఖ విమానాశ్రయ రన్ వే.. డ్రీమ్ లైనర్ వంటి విమానాల రాకకు అనువుగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ - వైజాగ్- నాగపూర్- బ్యాంకాక్ విమానాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఎయిర్ ఇండియా సౌతిండియా రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరిహరన్ తెలిపారు. ఢిల్లీ-వైజాగ్- చెన్నై, త్రివేండ్రం విమానం కూడా ప్రారంభించే ఆలోచన ఉందని ఆయన తెలిపారు. అనుమతులిస్తే వారం రోజుల్లో విశాఖ నుంచి దుబాయ్ కు విమానాలు నడుపుతామని ఫ్లై దుబాయ్ ప్రతినిథి చెప్పారు. విశాఖకు విమానాలు నడిపేందుకు శ్రీలంక ఎయిర్ లైన్స్ కూడా సుముఖత వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: