బొగ్గుగనులకు పట్టిన అవినీతి తుప్పు వదలనుంది. 1993 నుంచి దేశంలో జరిగిన అన్ని బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం తన కీలక, చారిత్రాత్మక తీర్పులో పేర్కొంది. బొగ్గు గనుల కేటాయింపులు అక్రమంగా జరి గాయని, కేటాయింపుల ప్రక్రియ సజావుగా సాగలేదని, పారదర్శకత లోపించిందని, కేటాయింపుల బాధ్యత తీసుకున్న స్క్రీనింగ్‌ కమిటీ సరైన రీతిలో వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేటాయింపులు ఏ ప్రక్రియలో జరగాలనేది న్యాయస్థానం తెలియచేస్తుందని వెల్లడించింది. అక్రమంగా జరిగిన అన్ని కేటా యింపులపై వేటు పడాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోథాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కోల్‌గేట్‌పై శనివారమే తీర్పును సిద్ధం చేసింది. దీనిని సోమవారం వెలువరించింది. 'కేటాయింపులలో విధానాలు పాటించ లేదు. అక్రమాలు చోటుచేసుకున్నాయి. పారదర్శకత లోపించింది. పర్యావరణ నిబంధనలకు మంగళం పాడారు. పర్యావరణ అను మతుల గురించి పట్టించుకోలేదు. ఈ దశలో 93 నుంచి జరిగిన అన్ని బొగ్గుగనుల క్షేత్రాల కేటాయింపులను రద్దు చేయడమే ఇప్పు డున్న మార్గం. కేటాయింపులలో మార్గదర్శకసూత్రాలను ఉల్లంఘిం చారు. నిర్థిష్ట మార్గదర్శక నియమావళిని పాటించలేదు' అని ధర్మా సనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేటాయింపులు ఏకపక్షంగా జరి గాయని, చట్ట వ్యతిరేక పద్ధతిలో తతంగం చేపట్టారని తెలిపారు. ఇప్పటికే కొన్ని కంపెనీలకు లైసెన్సులు దక్కి, అవి భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టాయనే కారణంతో లైసెన్సులను రద్దు చేయకుండా ఉండాలనే వాదనలో విలువ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే వివాదాస్పదంగా మారిన 40 కోల్‌బ్లాక్‌ల కేటాయింపులను రద్దు చేస్తున్నట్లు కేంద్రం తెలియచేసిందని, ఇక ప్రైవేటు కంపెనీలకు దక్కిన మరో 29 కోల్‌బ్లాక్‌ల లైసెన్సులపై కూడా అక్రమాల జాడలు ఉండటంతో వాటిని కూడా రద్దు చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు ఆదేశించింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపు వ్యవహారంపై సిబిఐ చాలా సంవత్సరాలుగా దర్యాప్తు జరుపుతోంది. అయితే బొగ్గు క్షేత్రాల కేటాయింపు వ్యవహారాలలో పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాల పాత్ర ఉందని అభియోగాలు రావడం, ఓ దశలో బొగ్గు గనుల మంత్రిత్వశాఖ బాధ్యతలు కూడా నిర్వహించిన అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పాత్రపై కూడా వివాదం తలెత్తడంతో దర్యాప్తు మందగించిందనే ఆరోపణలు వెలువడ్డాయి. సిబిఐ తమ విచారణలలో భాగంగా పలు సంస్థలపై కేసులు దాఖలు చేసింది. బొగ్గు గనుల మంత్రిత్వశాఖలను నిర్వహించిన మంత్రులను కూడా విచారణకు పిలిచింది. ఏఎంఆర్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌, జెఎల్‌డి యావత్‌ మాల్‌ ఎనర్జీ, విని ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఉద్యోగ్‌, వికాస్‌ మెటల్స్‌, జిందాల్‌ స్టీల్‌, హిందాల్కో వంటి ప్రముఖ కంపెనీలపై ఈ కేటాయింపుల వ్యవహారంలో సిబిఐ 16 చార్జీషీట్లను దాఖలు చేసింది. ప్రభుత్వ విచక్షణ, ప్రభుత్వ నిర్ణయాధికారంలో భాగంగా 1993 నుంచి ఇప్పటివరకూ జరిగిన బొగ్గు గనుల క్షేత్రాల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదం కావడంతో సిబిఐ దర్యాప్తు తీవ్రస్థాయిలోనే సాగింది. కేటాయింపుల వ్యవహారాలలో అవినీతి చోటుచేసుకున్నట్లు ప్రాథమిక విచారణలతో కనుగొన్నట్లు కూడా సిబిఐ సుప్రీంకోర్టుకు విన్నవించుకుంది. కాగా సోమవారం నాటి తీర్పులో కోల్‌ బ్లాక్‌ల కేటాయింపుల్లో అక్రమార్కులపై విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: